తెలుగు ప్రమోషన్స్ కు దూరంగా బాలీవుడ్ బ్యూటీ..!?
కానీ వాటిల్లో హీరోయిన్ కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 3 Jan 2025 3:03 PM GMTరామ్ చరణ్ హీరోగా ఎస్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజ్ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది. సంక్రాంతి స్పెషల్ గా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ వాటిల్లో హీరోయిన్ కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషించగా.. తండ్రి పాత్రకు జోడీగా తెలుగమ్మాయి అంజలి, కొడుకు పాత్రకు జంటగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించారు. చరణ్ తో పాటుగా అంజలి అగ్రెసివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది కానీ, మెయిన్ హీరోయిన్ అయిన కియారా మాత్రం ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల అమెరికాలోని డల్లాస్ లో జరిగిన భారీ ఈవెంట్ కు కియరా వెళ్లలేదు.
లేటెస్టుగా హైదరాబాద్ లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కియారా అద్వానీ కనిపించలేదు. అంతకముందు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లోనూ అమ్మడు పాల్గొనలేదు. దీంతో కీలకమైన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు అయినా వస్తుందా రాదా? అనే చర్చ జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా, రాజమండ్రి వేదికగా భారీ స్థాయిలో ఫంక్షన్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేశారు. దీనికి కియారా కూడా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఏ సినిమాకైనా హీరో హీరోయిన్లు ప్రచారంలో పాల్గొనడం ఎంతో అవసరం. పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఇతర భాషల ఆడియన్స్ కు సినిమాని చేరువ చెయ్యడానికి హీరోయిన్ కూడా తప్పకుండా పబ్లిసిటీ చేయాలి. 'పుష్ప 2' మూవీకి రష్మిక మందున్న ఎలా ప్రచారం చేసిందో మనం చూశాం. అల్లు అర్జున్ తో కలిసి దేశమంతా చుట్టేసింది. కానీ ఇక్కడ కియారా అద్వానీ మాత్రం కీలకమైన కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు.
అలా అని కియారా పూర్తిగా 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ ను అవైడ్ చేయలేదు. లక్నోలో జరిగిన టీజర్ లాంఛ్ ఈవెంట్ లో రామ్ చరణ్ తో కలిసి పాల్గొంది.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ తర్వాతనే ఎక్కడా కనిపించలేదు. శుక్రవారం ముంబైలో జరిగిన కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో చెర్రీతో పాటుగా సందడి చేసింది కియారా. కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూలు, టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంది. బీటౌన్ లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
'గేమ్ ఛేంజర్' హిందీ ప్రమోషన్స్ కు హాజరవుతున్న కియారా అద్వానీ.. ఎందుకనో సౌత్ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. మామూలుగా పెద్ద హీరోల సినిమా ఈవెంట్స్ కు హీరోయిన్లు దూరంగా ఉండరు. అందులోనూ నిర్మాత దిల్ రాజు తన సినిమాల పబ్లిసిటీ విషయంలో చాలా కచ్ఛితంగా ఉంటారు. ఇప్పటి వరకూ తెలుగు స్టేట్స్ లో జరిగిన ఈవెంట్స్ కు కియారా ఎందుకు రాలేదో తెలియదు కానీ, రాజమండ్రిలో జరిగే ఈవెంట్ కు మాత్రం తప్పకుండా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ వెంటనే రామ్ చరణ్ తో 'వినయ విధేయ రామ' మూవీ చేసింది. ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఐదేళ్ల తర్వాత మళ్ళీ చరణ్ - కియరా కలిసి ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీతో అలరించడానికి వస్తున్నారు. మరి ఈ జోడీ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.