కేన్స్ 2024: ఐష్ రేంజులో కియరా మెరిపించగలదా?
కేన్స్ ఫిలింఫెస్టివల్ అనగానే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పేరు గుర్తుకు వస్తుంది.
By: Tupaki Desk | 14 May 2024 9:38 AM GMTకేన్స్ ఫిలింఫెస్టివల్ అనగానే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పేరు గుర్తుకు వస్తుంది. భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నోసార్లు కేన్స్ లో సందడి చేసింది ఐశ్వర్యారాయ్. కేన్స్ లో ఐష్ మెరుపులు మిరుమిట్లకు సంబంధించిన ప్రతిదీ ఆన్ లైన్ లో ఫ్యాషన్ ప్రపంచంలో చర్చగా మారేవి. ఆ తర్వాత సోనమ్ కపూర్ కూడా భారతీయ ప్రతినిధిగా మెప్పించింది. అయితే ఇప్పుడు ఆ స్థాయిలో కియరా అద్వాణీ మెరిపించగలదా? అంటూ ఒకటే యూత్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
కియారా అద్వానీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో అరంగేట్రం చేయనుంది. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్‌లో కియరా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని ప్రఖ్యాత `వెరైటీ` ఒక కథనం వెలువరించింది. ప్రపంచ సినిమాకు ప్రోత్సాహకాలు .. చిత్రీకరణ సాంకేతిక అంశాల గురించి నాలుగు ప్యానెల్ చర్చలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో జరుగుతాయి. 18 మే 2024న లా ప్లేజ్ డెస్ పామ్స్‌లో ఈ చర్చలు జరుగుతాయి. ఈసారి కేన్స్ లో కియారా కాకుండా, నటి కం మోడల్ సల్మా అబు డీఫ్ .. మోడల్ కం గాయని సరోచా చంకిమ్హ (ఫ్రీన్).. నటుడు అధ్వా ఫహద్, నటుడు, గాయకుడు అసీల్ ఒమ్రాన్; దర్శకుడు, స్క్రీన్ రైటర్ రామతా టౌలే-సై కూడా రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్‌లో పాల్గొంటారు.
తాజా సమాచారం మేరకు `హీరమండి` స్టార్ అదితి రావ్ హైదరి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొననుంది. ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో అదితీరావ్ మూడోసారి తన ప్రదర్శనను ఇవ్వనుంది. మీడియాతో మాట్లాడుతూ అదితి తన ఉద్వేగాన్ని వ్యక్తం చేసింది. నాది సింహరాశి. అక్కడ తన ప్రదర్శన ప్రిపరేషన్ గురించి ఈ సందర్భంగా అదితీ మాట్లాడింది.
మే 14 నుండి 25 వరకు షెడ్యూల్ చేసిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశం హోస్ట్ చేసే `భారత్ పర్వ్` ఈవెంట్ ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు.
కేన్స్‌లో వానిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్‌కు కియరా హాజరు కానుంది. వినోద పరిశ్రమకు వారి ముఖ్యమైన సహకారాన్ని గుర్తిస్తూ ఇదే వేడుకలో కియారాతో పాటు ఐశ్వర్య రాయ్ బచ్చన్, శోభితా ధూళిపాళ, మరియు అదితి రావ్ హైదరీ రెడ్ కార్పెట్ పై సందడి చేయబోతున్నారు.