Begin typing your search above and press return to search.

'కిక్-2'కి రెడీ అయిన క్రేజీ కాంబినేష‌న్!

స‌ల్మాన్ ఖాన్ సాజిద్ న‌డియావాలా కాంబినేష‌న్

By:  Tupaki Desk   |   15 July 2023 7:54 AM GMT
కిక్-2కి రెడీ అయిన క్రేజీ కాంబినేష‌న్!
X

స‌ల్మాన్ ఖాన్ -సాజిద్ న‌డియావాలా కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన 'కిక్' అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధిం చిందో తెలిసిందే. 2014 లో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేసింది. 'కిక్' లేక‌పోతే జీవితంలో వినోదం ఉండ‌దంటూ ఈ జోడీ చేసిన హంగ‌మా అంతా ఇంతా కాదు. ఈ నేప‌థ్యంలో సినిమాకి సీక్వెల్ ఉంటుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగింది. కానీ అప్ప‌ట్లో సీక్వెల్ పై ఎవ‌రూ స్పందించలేదు.

తాజాగా స‌ల్మాన్ అండ్ కో డ‌బుల్ కిక్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. 'కిక్-2' టైటిల్ తో ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌ర విష‌యం పంచుకున్నారు. త్వ‌ర‌లోనే 'కిక్-2' తో మీ ముందుకు వ‌స్తాం. క‌థ సిద్దంగా ఉంది. కానీ కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేయ‌డానికి ఇంకా ఎక్కువ స‌మ‌యం ప‌ట్టొచ్చు.

కానీ ఈ సినిమా తీయ‌డానికి రెడీగా ఉన్నాను. స‌ల్మాన్ కూడా క‌థ విన్నారు. సినిమా ప‌ట్ల అభిమానులు ఎంత ఆస‌క్తిగా ఉన్నారో? ఊహించ‌గ‌ల‌ను. వాళ్ల అంచ‌నాలు ఏమాత్రం త‌గ్గ‌కుండా సినిమా ఉంటుంద‌ని' తెలిపారు.

దీంతో 'కిక్-2' షురూ అయిన‌ట్లేన‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ టైగ‌ర్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత ఏ సినిమా చేయాలి? అన్న దానిపై ఆయ‌నకి క్లారిటీ లేదు. ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌కులు క‌థ‌లు వినిపించి సిద్దంగా ఉన్నారు.

అందులో ప్ర‌భుదేవా..క‌న్న‌డ న‌టుడు సుదీప్ కూడా ఉన్నారు. ఇంకొంత మంది బాలీవుడ్ ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే భాయ్ త‌దుప‌రి సినిమా ఏ ద‌ర్శ‌కుడితో చేస్తున్నాడు? అన్న‌ది స‌స్పెన్స్ గా ఉంచారు.

టైగ‌ర్ -3 షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత త‌దుప‌రి ప్రాజెక్ట్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంత‌వ‌ర‌కూ భాయ్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న ఊహించాల్సిన ప‌నిలేదు. అలాగే బిగ్ బాస్ ఓటీటీ గేమ్ షోకి హోస్ట్ గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.