మరో స్టార్ హీరోని చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక
ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
By: Tupaki Desk | 7 Nov 2024 10:39 AM GMTవరుస బెదిరింపులతో సల్మాన్ ఖాన్ చుట్టూ హై అలెర్ట్ నెలకొంది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు భారీగా డబ్బు డిమాండ్ చేస్తూ, సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని వార్నింగులు ఇస్తుంటే పోలీసుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు మరో హిందీ నటుడు షారుఖ్ ఖాన్‌కు ఫోన్ కాల్ ద్వారా హత్యా బెదిరింపు వచ్చింది. ముంబై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటన సల్మాన్ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేసిన వరుస బెదిరింపుల తర్వాత రావడంతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు.
సల్మాన్ తరహాలోనే షారూఖ్‌ఖాన్‌కు గురువారం నాడు రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తూ హత్యా బెదిరింపు రావడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై BNS సెక్షన్ 308(4) మరియు 351(3)(4) కింద బెదిరింపులు, దోపిడీ కేసు నమోదైంది.
ముంబై పోలీస్ బృందం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించారు. ఈ కేసును మరింతగా విచారించేందుకు ముంబై పోలీసుల బృందాలు ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుండి ఖాన్ కు కాల్ వచ్చినట్లు పోలీసుల నుండి ఎటువంటి ధృవీకరణ లేనప్పటికీ, ముంబై పోలీసులు ఫయాజ్ ఖాన్‌కు నోటీసు ఇస్తున్నారని రాయ్‌పూర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఈరోజు ముంబై పోలీసులు పాండ్రి (రాయ్ పూర్) పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడ షారుఖ్ ఖాన్‌ను బెదిరించి డబ్బు డిమాండ్ చేసిన నేరం బాంద్రా పోలీస్ స్టేషన్‌లో నమోదైందని వారు తెలియజేశారు. ముంబై పోలీసులు నిందితుడికి నోటీసు ఇచ్చారు. అతని అరెస్ట్ గురించి ఎటువంటి సమాచారం రాలేదు. CSP సివిల్ లైన్స్ అజయ్ కుమార్ మాట్లాడుతూ..``ఆ వ్యక్తి పేరు మహ్మద్ ఫైజాన్ ఖాన్ అని గుర్తించాం. అతడు నవంబర్ 5 న బాంద్రా పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసాడు.మేం దర్యాప్తు చేస్తున్నాము.. ముంబై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు``అని తెలిపారు.
సల్మాన్ ఖాన్‌కు వరుస హత్య బెదిరింపుల సమయంలోనే షారూఖ్ కి ఈ కాల్ వచ్చిందని వారు పేర్కొన్నారు. కృష్ణ జింకను చంపినందుకు సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులో విమోచనగా రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బెదిరింపును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.