'కింగ్' కోసం ఆ ఇద్దరిలో ఎవరు?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందబోతున్న 'కింగ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
By: Tupaki Desk | 13 March 2025 11:27 AM ISTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందబోతున్న 'కింగ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను సిద్దార్థ్ ఆనంద్ రూపొందించబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా జరుగుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం నటీ నటుల ఎంపిక విషయమై చర్చలు జరుపుతున్నాడని సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నటిని ఎంపిక చేసేందుకు సిద్దార్థ్ చాలా లోతుగా ఆలోచిస్తున్నాడని జాతీయ మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను సిద్దార్థ్ తన దృష్టిలో పెట్టుకున్నాడని సదరు కథనంలో పేర్కొన్నారు.
షారుఖ్ ఖాన్ స్టార్‌డంకి సరిపోయే విధంగా కరీనా కపూర్ ఖాన్ లేదా దీపికా పదుకొనేలను సిద్దార్థ్ పరిశీలిస్తున్నాడట. వీరిద్దరితోనూ షారుఖ్ ఖాన్ గతంల నటించారు. వీరితో షారుఖ్ హిట్ పెయిర్‌గా చెప్పుకోవచ్చు. అందుకే వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం ద్వారా కింగ్ సినిమా స్థాయిని మరింత పెంచవచ్చు అని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే చర్చలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. సిద్దార్థ్ ఆనంద్ నిర్ణయంను షారుఖ్ ఖాన్ సమర్ధించే అవకాశాలు ఉన్నాయి. షారుఖ్ ఆ ఇద్దరు హీరోయిన్స్‌లో ఎవరితో అయినా నటించేందుకు రెడీగా ఉంటారు, ఇద్దరితోనూ షారుఖ్‌కి గతంలో నటించిన అనుభవం ఉంది, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
కింగ్ సినిమాలో షారుఖ్ ఖాన్‌కి జోడీగా నటించబోతున్న హీరోయిన్ విషయమై అతి త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సైతం కీలక పాత్రలో నటించబోతుంది. ఇప్పటికే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా కోసం ఆమె రెడీ అవుతుందని, కింగ్ సినిమాతో సుహానా ఖాన్ పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందని షారుఖ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. హీరోయిన్‌గా సుహానా ఖాన్ ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఆమె తండ్రి సినిమాతోనే తెరంగేట్రం కు సిద్ధం అయింది.
ఇక ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. గతంలో షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి పూర్తి స్థాయి విలన్‌గా అభిషేక్ బచ్చన్ కింగ్ సినిమాలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్‌లు కింగ్ సినిమా కోసం ఫిజిక్ బిల్డ్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు సంజయ్ ఘోష్ దర్శకత్వం చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల షారుఖ్ ఖాన్‌తో సూపర్ హిట్‌ను అందించిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అతి త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కానుంది.