కింగ్ నాగార్జున.. సీఎంతో సయోధ్యనే కోరుకుంటున్నాడా?
నాగ్ స్వయంగా రేవంత్ కు శాలువా కప్పడం, రేవంత్ సైతం నవ్వుతూ నాగార్జునతో మాట్లాడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2024 10:29 AM GMTతెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఎఫ్‌డీసీ కొత్త ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరిగింది. అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ సహా పలువురు సినీ హీరోలు, దర్శక నిర్మాతలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అప్పటికప్పుడు సీఎం అపాయింట్మెంట్ ఫిక్స్ అయినప్పటికీ, దాదాపు 50 మంది సినీ ప్రముఖులు అన్ని పనులు మానుకొని సీఎంతో భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు, ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇదంటుంచితే ఈ మీటింగ్ లో రేవంత్ - నాగార్జున చేతులు కలుపుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తుందని అనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం అక్రమం అంటూ హైడ్రా అధికారులు కూల్చి వేశారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ చెరువుకు సంబంధించిన స్థలాన్ని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని, చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని తెలిపారు. ఎన్ కన్వెషన్ సెంటర్ గురించి వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని, ఎలాంటి వదంతులు అవాస్తవాలు నమ్మవద్దని చెప్పారు. గతంలో కొన్ని సందర్భాల్లో కన్వెన్షన్ సెంటర్ గురించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని వార్తలు వినిపించాయి.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటన మరువక ముందే తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. అక్కినేని ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోడానికి కేటీఆర్ కారణమంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండటానికి సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు నాగార్జున, నాగచైతన్య ఆమెను బలవంతపెట్టారని.. దీనికి సమంత నిరాకరించడం వారి విడాకులకు దారితీసిందని సురేఖ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున.. మంత్రిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ రెండు వివాదాలతో నాగార్జున - రేవంత్ రెడ్డి సర్కారుకు మధ్య గ్యాప్ వచ్చిందనే మాట నిజమేనని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.
సీఎంతో జరిగిన సమావేశంలో సినీ ఇండస్ట్రీ తరపున సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి శాలువాలు కప్పి విష్ చేశారు. నాగ్ స్వయంగా రేవంత్ కు శాలువా కప్పడం, రేవంత్ సైతం నవ్వుతూ నాగార్జునతో మాట్లాడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేసినా నాగార్జున సీఎంతో సయోధ్యనే కోరుకున్నట్లు తెలుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఆమె వ్యక్తిగతంగానే చూసి కోర్టులోనే ఆమెతోనే పోరాడే అవకాశం ఉందని అంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి ఈ మీటింగ్ కు రాలేదు కాబట్టి, కింగ్ నాగ్ ఇండస్ట్రీకి పెద్దగా సీఎంతో భేటీ అయ్యారని.. అందులో తప్పేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి - అక్కినేని నాగార్జున ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం, సన్నిహితంగా మెలగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివాదాలు పక్కన పెట్టి కలిసిపోయారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని నాగ్ ఈ మీటింగ్ లో అన్నారు. హైదరాబాద్ ప్రపంచ సినిమాకి క్యాపిటల్ కావాలనేదే తమ కోరిక అని, యూనివర్సల్ లెవల్‌లో స్టూడియో సెటప్‌లు ఉండాలని తెలిపారు.