మూవీ రివ్యూ : 'కింగ్ ఆఫ్ కొత్త'
By: Tupaki Desk | 24 Aug 2023 9:11 AM GMT'కింగ్ ఆఫ్ కొత్త' మూవీ రివ్యూ
నటీనటులు: దుల్కర్ సల్మాన్- ఐశ్వర్యా లక్ష్మి-షబీర్-ప్రసన్న-గోకుల్ సురేష్-శరణ్ శక్తి-చెంబన్ వినోద్ జోస్-అనిక సురేంద్రన్-టీజీ రవి తదితరులు
సంగీతం: జోక్స్ బిజోయ్- షాన్ రెహ్మాన్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
రచన: అభిలాష్ చంద్రన్
నిర్మాణం: దుల్కర్ సల్మాన్-జీ స్టూడియోస్
దర్శకత్వం: అభిలాష్ జోషీ
ఓకే బంగారం.. మహానటి.. సీతారామం చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్. అతను మలయాళంలో నటించిన కింగ్ ఆఫ్ కొత్త మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 'కింగ్ ఆఫ్ కొత్త' తెలుగు వెర్షన్ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
'కొత్త' పట్టణాన్ని కన్న (షబీర్' తన గుప్పెట్లో పెట్టుకుని ఏలుతుంటాడు. మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా అమ్ముతూ.. దందాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్న కన్నకు కొత్త గా సీఐగా వచ్చిన హసన్ (ప్రసన్న) అడ్డుకట్ట వేయాలనుకుంటాడు. కానీ కన్న మొదట్లోనే అతడికి చెక్ పెడతాడు. కన్నను ఎలా దెబ్బ కొట్టాలా అని చూస్తున్న హసన్ కు రాజు (దుల్కర్ సల్మాన్) గురించి తెలుస్తుంది. కన్న స్నేహితుడే అయిన రాజు.. ఒకప్పుడు ఒకప్పుడు 'కొత్త' ను మకుటం లేని మహారాజులా ఏలాడని తెలుసుకుంటాడు హసన్. రాజు కథ తెలుసుకుని అతణ్ని తిరిగి కొత్త కు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. మరి రాజు తిరిగి కొత్త కు వచ్చాడా.. అతడి గతమేంటి.. తిరిగి ' కొత్త' కు వచ్చాక అతనేం చేశాడు అన్నది మిగతా కథ.
కథనం విశ్లేషణ:
గ్యాంగ్ స్టర్ డ్రామా అనగానే కథలన్నీ ఒక శైలిలో సాగిపోతుంటాయి. ఒక మామూలు వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో రౌడీ అవుతాడు. ముందు చిన్న స్థాయిలోనే రౌడీయిజం చేసి.. తర్వాత ఒక ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకునే రేంజికి వెళ్తాడు. కానీ తాను పట్టుకున్న కత్తే అతడికి శాపంగా మారుతుంది. కుట్రల కారణంగా దెబ్బ తిని తప్పనిసరి పరిస్థితుల్లో కత్తి వదిలేస్తాడు. కొంచెం గ్యాప్ తర్వాత అతడిలోని దాదా మళ్లీ బయటికి వస్తాడు. శత్రువులతో అమీతుమీ తేల్చుకుని కథను ముగిస్తాడు. ఈ కోవలో బోలెడన్ని సినిమాలు చూశాం. ఈ కథలు ఎలా మొదలైనా.. కంచికి తీరేది మాత్రం ఈ తరహాలోనే. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేసే దుల్కర్ సల్మాన్ ఏరి కోరి గ్యాంగ్ స్టర్ డ్రామా చేయడమే కాక.. దాన్ని ప్రొడ్యూస్ కూడా చేశాడంటే.. 'కింగ్ ఆఫ్ కొత్త' కొంచెం భిన్నమైన దారిలో ఏమైనా నడుస్తుందేమో అనుకుంటే.. అలా ఏమీ జరగలేదు. ఇది కూడా సగటు గ్యాంగ్ స్టర్ డ్రామానే. దుల్కర్ సహా ప్రధాన పాత్రధారుల పెర్ఫామెన్స్.. సాంకేతిక హంగులను మినహాయిస్తే.. దాదాపు మూడు గంటల నిడివిలో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అంశాలు తక్కువే.
ఈ ఓటీటీ రోజుల్లో మలయాళం సినిమాలకు బాగా అలవాటు పడ్డ వారికి అక్కడి సినిమాలు ఎలా సాగుతాయో అవగాహన ఉంటుంది. మన సినిమాల్లో మాదిరి అక్కడ కథలు పరుగులు పెట్టవు. సన్నివేశాల్లో హడావుడి ఉండదు. పంచ్ డైలాగులు పేలవు. రోమాలు నిక్కబొడుచుకునేలా మాస్ హీరోయిజాన్ని అక్కడి దర్శకులు ఎలివేట్ చేయడానికి ప్రయత్నించరు. 'కింగ్ ఆఫ్ కొత్త'లో కొంతమేర హీరోకు ఎలివేషన్ ఇవ్వడం.. బోలెడన్ని ఫైట్లు పెట్టడం మినహాయిస్తే.. మిగతాదంతా సగటు మలయాళ సినిమాల్లాగే నెమ్మదిగా.. తాపీగా నడుస్తుంది. ఐతే ఈ కథలో మలయాళం థ్రిల్లర్ సినిమాల మార్కు ట్విస్టులేమైనా ఉంటే.. పోనీ వాళ్ల శైలిలో డీప్ ఎమోషనల్ డ్రామా అయినా పండి ఉంటే 'కింగ్ ఆఫ్ కొత్త' మెప్పించేది. కానీ ఇటు మన మార్కు ఎలివేషన్లూ లేక.. అటు మలయాళం మార్కు కథాబలం లేక ఈ సినిమా చాలా సాధారణంగా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో 'హై' ఇచ్చే ఎపిసోడ్ అంటూ ఒక్కటీ లేకపోవడం పెద్ద మైనస్.
హీరోను జీరో నుంచి కాకుండా నేరుగా డాన్ లాగా పరిచయం చేయడం ఒక్కటే 'కింగ్ ఆఫ్ కొత్త'ను సగటు గ్యాంగ్ స్టర్ డ్రామాలకు భిన్నంగా నిలిపేది. ముందు విలన్.. అతడి బలాన్ని చూపించి.. అంతటి వాడినే దెబ్బ కొట్టిన వీరుడిగా హీరో పాత్రను తెరపైకి తేవడం మంచి ఎత్తుగడే. కానీ ముందు హీరోకు ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్లు ఆ తర్వాత బ్యాక్ స్టోరీ ఉండదు. దాదాపు గంట పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ లో వావ్ అనిపించే ఎపిసోడ్లు అయితే ఏవీ లేవు. హీరో రౌడీ మాత్రమే కాక ఫుట్ బాలర్ గా చూపించడం.. తన రౌడీ గ్యాంగ్ అంతా ఓవైపు దందాలు చేస్తూ ఇంకోవైపు ఫుట్ బాల్ ఆడి రిలాక్స్ అవ్వడం ఒక్కటే కొత్తదనం. కథానాయికతో ప్రేమాయణం సహా.. హీరో 'కొత్త' టౌన్లో తన ఆధిపత్యాన్ని చాటే సన్నివేశాలు సాధారణంగా అనిపిస్తాయి. కేవలం దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్.. జేక్స్ బిజోయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ వల్ల మాత్రమే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.
కథలో అంతో ఇంతో మలుపులు ఉండటం వల్ల ప్రథమార్ధం అయినా పర్వాలేదనిపిస్తుంది కానీ.. 'కింగ్ ఆఫ్ కొత్త' ద్వితీయార్ధంలో మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరో తిరిగి కోతా పట్టణానికి వచ్చి విలన్ కు చెక్ పెట్టే వ్యవహారం అంతా చాలా రొటీన్ గా సాగిపోతుంది. ఎత్తులు పై ఎత్తులు ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించవు. ఒకదాని తర్వాత ఒకటి యాక్షన్ ఎపిసోడ్లు వస్తూ పోతుంటాయి తప్ప.. కథలో అయితే ఏ కదలికా కనిపించదు. ముగింపు ముందే అర్థమైపోవడంతో దాని కోసం ఎదురు చూడటమే మిగులుతుంది. కథలో కొత్తదనం లేకుండా.. పెద్దగా మలుపులేమీ లేకుండా.. కేవలం దుల్కర్ సల్మాన్ పెర్ఫామెన్స్ కోసం.. స్టైలిష్ టేకింగ్.. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మూడు గంటల నిడివి ఉన్న సినిమాను భరించాలంటే చాలా ఓపిక ఉండాలి. దుల్కర్ ఫ్యాన్స్ తప్ప మిగతా వారికి ఈ సినిమా అస్సలు కనెక్ట్ కాకపోవచ్చు.
నటీనటులు:
దుల్కర్ సల్మాన్ ఏ పాత్ర చేసినా.. దాన్ని ఓన్ చేసుకుని ఎంత బాగా నటిస్తాడో తెలిసిందే. ఇప్పటిదాకా ఎలివేషన్లు లేని సాధారణ పాత్రలే ఎక్కువగా చేసిన దుల్కర్.. మాస్ టచ్ ఉన్న గ్యాంగ్ స్టర్ పాత్రలో సులువుగా ఒదిగిపోయాడు. ఆ పాత్ర తాలూకు ఇంటెన్సిటీని ఆద్యంతం క్యారీ చేశాడు. దుల్కర్ అభిమానులకు అతడి పాత్ర.. నటన బాగా నచ్చుతుంది. సినిమాను చాలా వరకు తన భుజాల మీద మోశాడు దుల్కర్. 'సార్పట్ట'లో డ్యాన్సింగ్ రోజ్ పాత్రలో అదరగొట్టిన షబీర్.. 'కింగ్ ఆఫ్ కొత్త'లో విలన్ పాత్రలో మెప్పించాడు. 'సార్పట్ట'లో చూసిన వాళ్లకు ఇందులో అతణ్ని పోల్చుకోవడం కష్టం. కథానాయికగా చేసిన ఐశ్వర్యా లక్ష్మి లుక్స్ పరంగా నిరాశ పరిచింది. తన పెర్ఫామెన్స్ ఓకే. విలన్ భార్యగా నైలా బాగా చేసింది. ఇంగ్లిష్ మాట్లాడే దాదా పాత్రలో చెంబన్ వినోద్ జోస్ ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
'ట్యాక్సీవాలా' సహా కొన్ని తెలుగు సినిమాలకు పని చేసిన జేక్స్ బిజోయ్.. 'కింగ్ ఆఫ్ కొత్త'కు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా లేకపోవచ్చు కానీ.. సినిమాకు అతి పెద్ద ఆకర్షణ అతడి నేపథ్య సంగీతమే. షాన్ రెహ్మాన్ తో కలిసి అతనందించిన పాటలు కూడా ఓకే. నిమిష్ రవి ఛాయాగ్రహణం బాగుంది. గ్యాంగ్ స్టర్ సినిమాల థీమ్ కు తగ్గట్లు.. ఒక మూడ్ క్రియేట్ చేసేట్లు విజువల్స్ ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాంకేతికంగా సినిమా గొప్పగా అనిపించినా.. అభిలాష్ జోషీ టేకింగ్ కూడా బాగున్నా.. కథాకథనాల్లో వైవిధ్యం లేకపోవడం 'కింగ్ ఆఫ్ కొత్త'కు మైనస్. కథలో మలుపులు లేకుండా.. డ్రామా అనుకున్న స్థాయిలో పండకుండా.. ఇంత నెమ్మదిగా సినిమాను నడిపిస్తే చాలా కష్టం.
చివరగా: కింగ్ ఆఫ్ కొత్త.. అదే కథ.. సాగతీత
రేటింగ్: 2/5