పాన్ ఇండియా కాదు ప్రాంతీయ మూవీనే..!
తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీడియం రేంజ్ మూవీ 'క' ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావించారు.
By: Tupaki Desk | 28 Oct 2024 5:42 AM GMTటాలీవుడ్‌లో రూపొందుతున్న చాలా సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారు, కానీ చివరి నిమిషంలో సాధ్యం అవ్వడం లేదు. ఇబ్బందులు ఎదురైనా కొన్ని చిన్న, పెద్ద సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయినా అక్కడ ఆకట్టుకోలేక పోతున్నాయి. మినిమం వసూళ్లను సైతం తెలుగు రాష్ట్రాల బయట వసూళ్లు సాధించలేక పాన్ ఇండియా ట్యాగ్ కే పరిమితం అవుతున్నాయి. కొన్ని సినిమాలు ప్రారంభించిన సమయంలోనే పాన్ ఇండియా సినిమాలంటూ ప్రచారం చేస్తున్నారు, కానీ విడుదల విషయానికి వచ్చేప్పటికి వారు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయలేక పోతున్నారు. బయ్యర్లు దొరక్క పోవడంతో పాటు, ప్రచారం చేయలేక పాన్ ఇండియా రిలీజ్ ను క్యాన్సల్ చేసుకుంటారనే విషయం చాలా సినిమాల విషయంలో నిరూపితం అయ్యింది.
తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీడియం రేంజ్ మూవీ 'క' ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావించారు. టైటిల్ ను అన్ని భాషల్లో చూపించడంతో పాటు, ప్రమోషనల్ స్టఫ్ ను వేరు వేరు భాషల్లో ప్లాన్ చేశారు. కానీ విడుదల సమయం దగ్గర పడుతున్నా తెలుగు రాష్ట్రాల బయట ప్రచారం కనిపించడం లేదు. దాంతో కేవలం తెలుగు లో మాత్రమే విడుదల కాబోతోందని తేలిపోయింది. హిందీలో సినిమాకు బిజినెస్ అవ్వలేదని సమాచారం అందుతోంది. తక్కువ థియేటర్‌లలో విడుదల చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. కన్నడ, తమిళ్‌లోనూ అదే పరిస్థితి ఎదురయిందని సమాచారం అందుతోంది.
మలయాళంలో ఈ సినిమాను యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ కి సిద్ధం అయ్యాడు. 'క' పై నమ్మకంతో మలయాళ డబ్బింగ్ రైట్స్ ను దక్కించుకున్న దుల్కర్ సల్మాన్ సాధ్యం అయినంత ఎక్కువగా రిలీజ్ చేయాలని అనుకున్నాడట. కానీ దుల్కర్ సల్మాన్ నటించిన 'లక్కీ భాస్కర్' సైతం అదే రోజున రాబోతున్న కారణంగా 'క' ను మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేయడం కరెక్ట్ కాదని స్వయంగా కిరణ్ అబ్బవరం మలయాళం రిలీజ్ ను క్యాన్సల్ చేసుకున్నారట. మొత్తానికి తెలుగు లో తప్ప మరే భాషలోనూ 'క' సినిమాను రిలీజ్ చేయడం లేదు. సినిమాకు పాజిటవ్ టాక్ వచ్చి, హిట్ అయితే అప్పుడు ఇతర భాషల్లో రిలీజ్ అయ్యేనా చూడాలి.
విభిన్నమైన కాన్సెప్ట్‌తో, కాస్త మంచి సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో కిరణ్ అబ్బవరం ఏడాది గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియాడిక్ నేపథ్యంలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందిన 'క' సినిమా ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. సినిమాకు తగ్గట్లుగా ప్రమోషన్ చేయడంతో అంచనాలు మరింత పెంచారు. ఇప్పుడు సినిమాను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ చెప్పడంతో ఇది పాన్ ఇండియా మూవీ కాదు ప్రాంతీయ మూవీ అని తేలిపోయింది. ముందు ముందు అయినా ఈ సినిమా అక్కడ విడుదల కావాలని కోరుకుందాం.