Begin typing your search above and press return to search.

కిరణ్ సక్సెస్ వెనుక రహస్య

ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్‌ను తాజాగా నిర్వహించింది. దీనికి హీరో కిరణ్ అబ్బవరంతో పాటు దర్శకులు, నిర్మాత, పలువురు నటీనటులు హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   2 Nov 2024 9:15 AM GMT
కిరణ్ సక్సెస్ వెనుక రహస్య
X

స్వయంకృషితో హీరోగా పరిచయం అయినా.. ఆరంభం నుంచే తనదైన రీతిలో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు రాయలసీమ చిన్నోడు కిరణ్ అబ్బవరం. కెరీర్ మొదలెట్టిన కొత్తలోనే పలు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం సక్సెస్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లోనే తాజాగా కిరణ్ అబ్బవరం ‘క’ అనే ప్రయోగాత్మక చిత్రంతో వచ్చాడు.

కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్, సందీప్ దర్శకత్వంలో రూపొందిన సినిమానే ‘క’. థ్రిల్‌కు గురి చేసే కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీనికితోడు ఆడియెన్స్ రెస్పాన్స్‌ను కూడా దక్కించుకుంటూ భారీ వసూళ్లను సాధిస్తోంది.

డిఫరెంట్ సబ్జెక్టుతో వచ్చిన ‘క’ సినిమా అంతటా అద్భుతమైన ప్రదర్శన చేసుకుంటూ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 13 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా విజయానికి చేరువగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్‌ను తాజాగా నిర్వహించింది. దీనికి హీరో కిరణ్ అబ్బవరంతో పాటు దర్శకులు, నిర్మాత, పలువురు నటీనటులు హాజరయ్యారు.

‘క’ సక్సెస్ మీట్‌లో భాగంగా కిరణ్ అబ్బవరం ఎంతో ఖుషీగా కనిపించాడు. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెప్పి ఆకట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఓ రిపోర్టర్ ‘రహస్య (కిరణ్ అబ్బవరం భార్య) గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా ఆయనను సపోర్ట్ చేయండి అని ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడామె ఈ సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు’ అని అడిగారు.

రహస్య గురించి వచ్చిన ప్రశ్నకు కిరణ్ అబ్బవరం సమాధానం ఇస్తూ.. ‘ఏ భార్య అయినా తన భర్త సినిమా చేస్తూ చూడమని అడుగుతుంది. రహస్య నా సక్సెస్‌లో ప్రముఖ పాత్రను పోషించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ సందర్భంగా అందరూ పెళ్లైన తర్వాత మంచి జరుగుతుంది అన్నారు. అలా ఆరోజు కోసం వెయిట్ చేస్తున్న నాకు ఇంత త్వరగా మంచి జరుగుతుందని అనుకోలేదు. ఎవరైనా సక్సెస్ రానోళ్లు ఉంటే త్వరగా పెళ్లి చేసుకోండి సక్సెస్ వచ్చేస్తుంది’ అంటూ బదులిచ్చాడు. తద్వారా తన సక్సెస్ వెనుక రహస్య ఉందని కిరణ్ అబ్బవరం స్పష్టం చేశాడు.

వాస్తవానికి కిరణ్ అబ్బవరం చెప్పినట్లుగానే ‘క’ సినిమా ప్రమోషన్స్‌లో రహస్య తనదైన భూమికను పోషించారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడిన మాటలు చాలా ప్రభావాన్నే చూపించాయి. అందుకే ఇప్పుడు ఈ యంగ్ హీరో ఆ క్రెడిట్ మొత్తాన్ని తన భార్యకే ఇచ్చేశాడు.