చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా: కిరణ్ అబ్బవరం
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సరికొత్త చిత్రం ‘క’ దీపావళి కానుకగా విడుదలైంది.
By: Tupaki Desk | 31 Oct 2024 8:13 AM GMTయువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సరికొత్త చిత్రం ‘క’ దీపావళి కానుకగా విడుదలైంది. సుజీత్ - సందీప్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా, విడుదలైన వెంటనే సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ నేపథ్యంలో తన సినిమాకు అందుతున్న స్పందన చూసి కిరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశం ఇచ్చాడు. కిరణ్ ‘‘ఈ దీపావళి నా జీవితంలో మరింత సంతోషాన్ని తెచ్చింది. ఈ సినిమాలోని పాత్రకు ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణతో నా మనసు ఆనందంతో నిండిపోయింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా. మీ అందరికీ హ్యాపీ దీపావళి’’ అని పోస్ట్ చేశాడు.
ఈ సందేశం అభిమానులను ఆనందపరిచింది. నెటిజన్లు కూడా ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. క సినిమా కిరణ్ అబ్బవరం యొక్క తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. భారీ బడ్జెట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి స్పందన ఇస్తున్నారు. ఈ సినిమాను తెరపైకి తీసుకురావడం కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడిందని కిరణ్ వెల్లడించాడు.
‘‘వాసుదేవ్ అనే వ్యక్తి కథ ఇది. అతనొక అనాథ. పక్కవారి జీవితాల్లో జరిగే విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటాడు. పోస్ట్‌మేన్‌గా మారి కృష్ణగిరి అనే ఊరికి వెళ్లిన తరువాత అతని జీవితంలో ఎదురైన సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అని సినిమాపై ఇదివరకే క్లూ ఇచ్చాడు కిరణ్. ఇప్పటివరకు ఇలాంటి కథను తెరపై చూడలేదని, అలాంటి కొత్త కంటెంట్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చానని కిరణ్ చెబుతున్నాడు.
‘‘ఇదొక భిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్. ఇలాంటి కథ ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ ఇలాంటి కథ ఉందని రుజువు చేస్తే సినిమాలు మానేస్తా’’ అని తన సినిమాపై ఉన్న నమ్మకాన్ని ప్రదర్శించాడు. ఈ చిత్రానికి సంబంధించి పలు ప్రీమియర్స్‌లో కిరణ్ అబ్బవరం పాల్గొని అభిమానులతో కలిసి సినిమా వీక్షించాడు.
సినిమాపై ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలు, కిరణ్ యాక్టింగ్, మేకింగ్, సంగీతం ఇలా ప్రతీ అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు సినిమా పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొదట ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ, థియేటర్ సమస్యల కారణంగా ప్రస్తుతం కేవలం తెలుగులోనే విడుదల చేయాల్సి వచ్చింది.