Begin typing your search above and press return to search.

కిరణ్‌ రహస్య వివాహ ముచ్చట్లు..!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోయిన్‌ రహస్య గోరఖ్‌ తో సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 10:20 AM GMT
కిరణ్‌ రహస్య వివాహ ముచ్చట్లు..!
X

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోయిన్‌ రహస్య గోరఖ్‌ తో సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. వీరి వివాహం కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధు మిత్రులు సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహ నిశ్చితార్థం కొన్ని వారాల క్రితం జరిగింది. తాజాగా వీరి వివాహానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఆగస్టు 22న కర్ణాటకలోని కుర్గ్‌ లో వీరి వివాహం జరగబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రహస్య ఫ్యామిలీతో పాటు బంధు మిత్రులు అంతా కూడా కుర్గ్‌ లో ఉంటారు. కనుక వివాహం అక్కడ జరగనుంది.

పెళ్లి తర్వాత అంటే రెండు లేదా మూడు రోజులకు కిరణ్‌, రహస్యల వివాహ రిసెప్షన్‌ ను హైదరాబాద్‌ లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు, మీడియా వారిని కూడా కిరణ్ అబ్బవరం ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. రిసెప్షన్‌ విషయమై కిరణ్ అబ్బవరం సైడ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో యంగ్‌ హీరోలు వారి వివాహంను అత్యంత వైభవంగా రెండు మూడు రోజులు అంటూ చూసుకుంటూ ఉంటే కిరణ్ అబ్బవరం మాత్రం రహస్య తో సింపుల్ గా కుర్గ్‌ లో కానివ్వడం చర్చనీయాంశంగా మారింది.

సాఫ్ట్‌వేర్ జాబ్‌ చేసే కిరణ్ అబ్బవరం షార్ట్‌ ఫిల్మ్స్ లో నటిస్తూ తనకు నటనపై ఉన్న ఆసక్తిని కనబర్చుతూ వచ్చాడు. ఆయనకు రాజా వారు రాణి గారు సినిమా తో ఛాన్స్ దక్కింది. ఆ సినిమా లో రహస్య హీరోయిన్ గా నటించడం తో అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరి ప్రేమ విషయం చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారు. అయితే ఈ ఏడాదిలోనే వీరి వివాహం ను ప్రకటించి ప్రేమ విషయాన్ని వెళ్లడించారు. వీరిద్దరి ప్రేమ విషయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే... గత సంవత్సరం వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ మరియు రూల్స్ రంజన్‌ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ ఏడాది 'క' అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంతో పోల్చితే కిరణ్ అబ్బవరం సినిమాలు ప్రేక్షకులకు మరింత ఎక్కువ చేరువ అయ్యే విధంగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. అంతే కాకుండా బడ్జెట్‌ ను కూడా పెంచి కిరణ్ అబ్బవరంతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. మరి పెళ్లి తర్వాత రహస్య సినిమాలను కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి.