ఆమె రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన `లాపటా లేడీస్` ఆస్కార్స్ 2025 బరిలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపికైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Dec 2024 10:30 AM GMTఅమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన `లాపటా లేడీస్` ఆస్కార్స్ 2025 బరిలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినా ఆస్కార్ బరిలో నిలిచిన తర్వాత ఈ మూవీ గురించి ఎక్కువ ప్రచారం దక్కుతోంది. కిరణ్ రావు ఇటీవల రెడ్డిట్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA) సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తన అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఒక సోషల్ మీడియా వ్యక్తి మీ చిత్రాల దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రమేయం ఉంటుందా? అని ప్రశ్నించారు.
ముఖ్యంగా మీ సినిమాలు రెండూ అమీర్ సొంత నిర్మాణ చిత్రాలే.. దర్శకత్వంలో ఆయన ప్రమేయం ఎంతవరకూ? అని ప్రశ్నించగా.. దీనికి ప్రతిస్పందిస్తూ తనకు అత్యంత సహాయకారిగా ఉండే నిర్మాత అమీర్ ఖాన్ అని కిరణ్‌రావు అన్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తలమునకలుగా ఉన్నప్పుడు సహకరిస్తారని వెల్లడించారు. తన చిత్రాలకు అమీర్ నిజంగా సపోర్టివ్ ప్రొడ్యూసర్.. కాస్టింగ్ ఎంపికలు, ఎడిటింగ్ లో సహకారం ఉంటుందని తెలిపారు. అయితే అతను సెట్‌కి కూడా రాడు! అని కిరణ్ రావు వెల్లడించారు.
కిరణ్ రావు 2011లో ధోబీ ఘాట్ లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాని అందించారు. 2024 లో లాపటా లేడీస్‌కి దర్శకత్వం వహించారు. ఈ రెండింటినీ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పుడు లాపాటా లేడీస్ ఏకంగా ఆస్కార్ బరిలో విదేశీ కేటగిరీలో భారతదేశం తరపున ఉత్తమ సినిమాగా పోటీపడుతోంది. కిరణ్ రెండు సినిమాలను నిర్మిస్తే ఆ రెండూ క్రిటికల్ గా ప్రశంసలు దక్కించుకున్నాయని నెటిజనులు ప్రశంసిస్తున్నారు.
ఇక కలిసి మెలిసి సినిమాలకు పని చేసే అమీర్- కిరణ్ లపై అభిమానులకు చాలా సందేహాలున్నాయి. దీంతో కిరణ్ రావును చాలా మంది రకరకాలుగా ప్రశ్నించారు. అమీర్ ఖాన్ వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? అని కిరణ్ ని ప్రశ్నించగా, అతడు కూల్‌గా ఉంటాడు.. గొప్ప కథలు చెబుతాడు.. నన్ను నవ్విస్తాడు! అని తెలిపారు.
`లాపటా లేడీస్` టైటిల్‌ను మార్చడాన్ని కొందరు ప్రశ్నించారు. `లాస్ట్ లేడీస్` అని పేరు ఎందుకు మార్చుకున్నారు? అని ప్రశ్నించగా .. ఇది సినిమాకి ఇంగ్లీష్ టైటిల్. మేము దానిని TIFF కోసం ఉపయోగించాం. ఆస్కార్ ప్రచారంలో గుర్తుంచుకోవడం సులభం అనిపించింది అని కిరణ్ తెలిపారు. నితాన్షి గోయెల్, ప్రతిభా రంత, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ తదితరులు నటించిన లాపటా లేడీస్, పితృస్వామ్యంపై వ్యంగ్య డ్రామా. ఇది కొత్తగా పెళ్లయిన ఇద్దరు వధువుల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. రైలు ప్రయాణంలో పెళ్లి కూతుళ్లు మారాక ఏం జరిగిందనే దానిని కామిక్ టచ్ తో తెరకెక్కించారు కిరణ్.
కిరణ్ రావు సినిమాలపై డిబేట్:
కిరణ్ రావు తన కెరీర్‌లో కేవలం రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నాయి !! ఈ సినిమాల గొప్పదనం లేదా కిరణ్ రావు డైరెక్షన్ ప్రత్యేకత ఏమిటి ?? అంటూ సోషల్ మీడియాలో డిబేట్ కొనసాగుతోంది.
కేవలం రెండు చిత్రాలతో కిరణ్ రావు క్వాంటిటీ కంటే క్వాలిటీ ఎక్కువ మాట్లాడుతుందని చూపించారు. ఆమె సినిమాలు .. ప్రత్యేక కథనం, పాత్రల డెప్త్ కారణంగా అంతర్జాతీయ గుర్తింపు పొందాయి అని ఒక నెటిజన్ అభిప్రాయపడగా.. ఆమె మాస్‌ని పట్టించుకోదు.. ఆమె ప్రేక్షకులను తెలివితక్కువ వాళ్లు అని భావించదు. కథ చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆమె చిత్రాలకు దర్శకత్వం వహిస్తుంది. స్వయంగా నిర్మిస్తుంది. ఆమె చిత్రాలకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రాకపోయినా, ఆమె ఎవరినీ మెప్పించడానికి ప్రయత్నించదు. ఆమె తాను చేయాలనుకున్నదే చేస్తుంది. అమీర్ ఆమెకు మద్దతు ఇవ్వడం చాలా గొప్ప విషయం.. కానీ అతడు లేకుండా కూడా ఆమె మంచి పని చేసి ఉండేదని.. సమాజానికి సంబంధించిన కథల ద్వారా సమస్యలను ప్రదర్శించగలదని నేను భావిస్తున్నాను.. అని ఒకరు అభిప్రాయపడ్డారు.
అమీర్ - కిరణ్ ఒక గొప్ప కళాకారుల బృందం. ఇద్దరూ తమ కళలో చాలా మంచి ప్రతిభావంతులు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ వారు పనిలో కొనసాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.. అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.