జితేందర్ రెడ్డి సినిమాకు కేంద్రమంత్రి ప్రశంస..!
రాకేష్ వర్రె లీడ్ రోల్ లో విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జితేందర్ రెడ్డి.
By: Tupaki Desk | 12 Nov 2024 9:07 AM GMTరాకేష్ వర్రె లీడ్ రోల్ లో విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 నేపథ్యంలో జగిత్యాలలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా జితేందర్ రెడ్డి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాను నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చూశారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డితో ఆయనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
గతంలో జితేందర్ రెడ్డి గారితో కలిసి తాను కూడా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా లో పనిచేశామని అన్నారు. జితేందర్ రెడ్డి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇంకా అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్తగా వ్యవహరించారని చెప్పారు కిషన్ రెడ్డి. బలహీన వర్గాలకు, పేద ప్రజలకు కష్టం వస్తే ఎప్పుడూ అండగా నిలబడిన వ్యక్తి జితేందర్ రెడ్డి. ఆయన జాతీయ భావజాలం, వీరోచిత పోరాట పటిమ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దాని వల్లే ఆయన చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారని చెప్పారు కిషన్ రెడ్డి.
ప్రజల కోసం ప్రజలతో ఉంటూ పోరాటం చేసిన వ్యక్తి జితేందర్ రెడ్డి. ఆయన కథతో తెరకెక్కిన ఈ సినిమా రావడం మంచి విషయం. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ బాగా నటించారు. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా డైరెక్ట్ చేసిన విరించి వర్మకు అభినందనలు తెలియచేశారు కిషన్ రెడ్డి.
జితేందర్ రెడ్డి జీవిత చరిత్రను ప్రజలకు తెలియచేయాలని ఆయన సోదరుడు రవీందర్ రెడ్డి చేసిన ప్రయత్నం చాలా గొప్పదని అన్నారు కిషన్ రెడ్డి. శరీరంలో 72 బుల్లెట్లు దింపి నక్సలైట్లు జితేందర్ రెడ్డిని హత్య చేశారు. తుపాకులతో హింస వల్ల అనుకున్నది సాధిస్తామని అనుకోవడం తప్పు.. ఆలోచన మార్చుకోవాలని ఈ సినిమా చెబుతుంది.సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చిత్ర యూనిట్ ని ప్రశంసించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాల తర్వాత కెరీర్ లో లాంగ్ గ్యాప్ తీసుకున్న విరించి వర్మ తన థర్డ్ ప్రాజెక్ట్ గా జితేందర్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమా ఎప్పుడో పూర్తైనా కూడా రిలీజ్ చేయడానికి కాస్త టైం తీసుకున్నారు.