రవితేజ పవర్ఫుల్ సీక్వెల్.. అసలు మ్యాటరెంటీ?
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే
By: Tupaki Desk | 20 April 2024 12:15 PM GMTమాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రవితేజకి ఈ మూవీ స్టార్ హీరో ఇమేజ్ తీసుకొచ్చింది. ఇప్పటికి రవితేజ కెరియర్ లో బెస్ట్ మూవీస్ గురించి చెప్పుకుంటే విక్రమార్కుడు పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ ఉంటుందని తాజాగా నిర్మాత కెకె రాధామోహన్ కన్ఫర్మ్ చేశారు. తను నిర్మించిన హిందీ మూవీ ప్రమోషన్ లో భాగంగా నిర్మాత రాధామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైటర్ విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు 2 స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిపారు. అలాగే భజరంగీ భాయ్ జాన్ మూవీ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందని అన్నాడు.
నిర్మాత మాటలతో విక్రమార్కుడు 2పై ఇప్పుడు ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. విక్రమార్కుడు 2 మూవీ తీయాలంటే ఇప్పుడు రవితేజ కథకి ఒకే చెప్పాల్సి ఉంటుంది. అలాగే రాజమౌళి మాత్రమే విక్రమార్కుడు సీక్వెల్ కి పూర్తిస్థాయిలో న్యాయం చేయగలడనే మాట వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం రాజమౌళి ఇమేజ్ పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళిపోయింది.
ఈ సమయంలో మరల వెనక్కి వచ్చి విక్రమార్కుడు సీక్వెల్ చేసే అవకాశం లేదని చెప్పాలి. అలాగే రవితేజ కూడా ఇప్పటి వరకు కథ వినలేదంట. గతంలో అయితే అతను రాజమౌళి డైరెక్ట్ చేస్తేనే ఆ సినిమా చేస్తానని గట్టిగా చెప్పాడు. ఒక వేళ రవితేజ ఓకే చెప్పినా కూడా ఆ కథకి కరెక్ట్ గా డీల్ చేసే డైరెక్టర్ ని పట్టుకోవడం కష్టమైన పని అనే టాక్ నడుస్తోంది.
సంపత్ నంది దర్శకత్వంలో ఈ మూవీ చేసే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తోంది. అయితే సంపత్ నందికి చాలా ఏళ్ళుగా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు. రీసెంట్ గా సాయి తేజ్ తో మొదలెట్టిన గంజా శంకర్ ఆగిపోయిందనే టాక్ వచ్చింది. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా ఓదేల 2 మూవీ చేస్తున్నారు.
సంపత్ నంది, రవితేజ కాంబినేషన్ కెకె రాధామోహన్ నిర్మాణంలోనే గతంలో బెంగాల్ టైగర్ సినిమా వచ్చింది. అయితే ఆ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ పరిస్థితిలో తన కెరియర్ కి ఒక బ్రాండ్ లా ఉన్న విక్రమార్కుడు లాంటి సినిమాకి సీక్వెల్ చేసే ధైర్యం రవితేజ చేస్తాడా అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. ఇక ఈ ప్రశ్నలన్నింటికి నిర్మాణ సంస్థ నుంచి త్వరలోనే సమాధానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.