విజయ్ ని ఫాలో అవుతోన్న అజిత్
ఇళయదళపతి విజయ్ తమిళనాడు రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు.
By: Tupaki Desk | 26 Sep 2024 12:30 AM GMTఇళయదళపతి విజయ్ తమిళనాడు రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకే సినిమాలు పూర్తిగా వదిలేసి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నాడు. తమిళనాడులో ఉన్న పొలిటికల్ స్పేస్ ని తాను ఉపయోగించుకోవాలని విజయ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు ఆయన రాజకీయ కార్యాచరణ గురించి కోలీవుడ్ నాట విస్తృత ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం హెచ్ వినోత్ దర్శకత్వంలో చేయనున్న సినిమానే తన ఆఖరి చిత్రం అని విజయ్ ప్రకటించారు.
కోలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక మార్కెట్ వాల్యూ ఉన్న హీరోగా విజయ్ ఉన్నాడు. అతను ఒక్కసారిగా సినిమాలకి దూరం కావడంతో తమిళ్ ఇండస్ట్రీకి కొంత చేదువార్త అని చెప్పాలి. విజయ్ లేని లోటుని ఎవరు భర్తీ చేయలేకపోవచ్చని సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు. అయితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తరహాలో మరల విజయ్ సినిమాలు చేసే అవకాశం ఉండొచ్చనే చిన్న ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది ఇప్పుడే చెప్పలేం.
ఇప్పుడు దళపతి విజయ్ బాటలోనే స్టార్ హీరో అజిత్ కూడా నడవబోతున్నాడనే ప్రచారం కోలీవుడ్ సర్కిల్ లో బలంగా వినిపిస్తోంది. అయితే అజిత్ విజయ్ తరహాలో కంప్లీట్ గా సినిమాలు మానేసే అవకాశం లేదంట. రెండు, మూడేళ్లు గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. అజిత్ చేతిలో ప్రస్తుతం ‘విడామయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చేసాయి.
‘విడామయార్చి’ ఈ ఏడాది డిసెంబర్ లో, లేదంటే 2025 సంక్రాంతి ఫెస్టివల్ కి ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉందంట. గుడ్ బ్యాడ్ అగ్లీ 2025 సమ్మర్ కి రిలీజ్ అవ్వనుంది. వీటి తర్వాత అజిత్ కొంతకాలం స్పోర్ట్స్ పై ఫోకస్ చేయబోతున్నారంట. ఆయన రేసర్ అనే విషయం అందరికి తెలిసిందే. 2025లో జరగనున్న యూరోపియన్ GT4 ఛాంపియన్ షిప్ లో పాల్గొనబోతున్నారంట.
దీనికోసం సినిమాలకి విరామం ఇవ్వబోతున్నారని టాక్. రెండేళ్ల పాటు అజిత్ నుంచి మూవీస్ రాకపోవచ్చని కోలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఇద్దరు బిగ్ స్టార్స్ సినిమాలకి గ్యాప్ ఇస్తే కచ్చితంగా అది కోలీవుడ్ మార్కెట్ పైన ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అజిత్ రెండేళ్ల గ్యాప్ తరువాత మూవీస్ చేసిన కూడా విజయ్ అయితే ఆల్ మోస్ట్ హీరోగా తన చాప్టర్ ముగించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఒక వేళ మళ్ళీ నటించిన 5-10 ఏళ్ళ తర్వాత మాత్రమే సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు.