థౌజౌండ్ వాలా వాళ్లకు ఇంకా ఆశగానే!
ఇప్పట్లో ఈ రికార్డును తిరగరాయడం సాధ్యమయ్యేది కాదు.
By: Tupaki Desk | 14 Dec 2024 6:45 PM GMTభారతీయ చలన చిత్ర చిత్ర పరిశ్రమలో 1000 కోట్ల వసూళ్లు అన్నది ఇప్పుడు చాలా ఈజీగా మారిన మాట. ఇప్పటికే ఈ క్లబ్ లో బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ ఎప్పుడో చేరిపోయాయి. టాలీవుడ్ అయితే ఏకంగా 6 రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్లతో కొత్త రికార్డును రాసింది. అత్యంత వేగంగా ఆరు రోజుల్లోనే 1000 కోట్లు తెచ్చిన సినిమాగా రీసెంట్ రిలీజ్ 'పుష్ప-2' ఆ ఘనత సాధించింది. దీంతో ఇండియన్ సినిమకు ఇదో రికార్డు. ఇప్పట్లో ఈ రికార్డును తిరగరాయడం సాధ్యమయ్యేది కాదు.
ఇంకా టాలీవుడ్ నుంచి వచ్చే ఏడాది మరిన్ని పాన్ ఇండియా సినిమాలు..అలాగే శాండిల్ వుడ్ నుంచి కూడా 'టాక్సిక్', 'కాంతార-2' లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి 1000 కోట్ల వసూళ్ల సత్తా ఉంది. కానీ అత్యంత వేగంగా మాత్రం సాధ్యం కాదు. హిట్ టాక్ తెచ్చుకుంటే లాంగ్ రన్ లో సాధ్యమవ్వొచ్చు. మరి ఇంతవరకూ 1000 కోట్ల క్లబ్ లో చేరని పరిశ్రమలు ఉన్నాయా? అంటే ఓ మూడు పరిశ్రమలు కనిపిస్తున్నాయి.
అవే కోలీవుడ్, మాలీవుడ్, భోజ్ పురీ ఇండస్ట్రీలు. ఈ మూడు పరిశ్రమలకు ఇంతవరకూ 1000 కోట్ల వసూళ్ల సినిమా ఒక్కటి కూడా లేదు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ , దళపతి విజయ్, తల అజిత్, సూర్య, ధనుష్, విక్రమ్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోలున్నారు. కానీ వీళ్లెవ్వరూ కూడా ఇంకా 1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. రజనీకాంత్ అంతర్జాతీయంగా మార్కెట్ ఉన్న నటులు.
ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా ఆయన నటించిన చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అవేవి 1000 కోట్ల వసూళ్లు సాధించలేదు. 'జైలర్' మాత్రం 650 కోట్ల వరకూ రాబట్టింది. కమల్ హాసన్ నటించిన `విక్రమ్` 500 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక విజయ్ నటించిన సినిమాలేవి 650 కోట్ల మార్క్ ను దాటలేదు. అలాగే అజిత్, విజయ్ సేతుపతి సినిమాలేవి కూడా 300 కోట్ల మార్క్ ను ఇంతవరకూ దాటలేదు. సూర్య, ధనుష్, విక్రమ్ సినిమాలది ఇదే పరిస్థితి. దీంతో ఇప్పుడీ హీరోలంతా 1000 కోట్ల వసూళ్ల ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మాలీవుడ్ చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులొస్తున్నాయ్ తప్ప కమర్శియల్ గా వర్కౌట్ అవ్వడం లేదు.