భయం పటా పంచల్ చేయాల్సింది వీళ్లే!
అయితే ఇప్పుడా సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సిన బాధ్యత వీళ్లపైనే ఉంది.
By: Tupaki Desk | 26 March 2025 6:11 AMకోలీవుడ్ కి సీక్వెల్స్ పెద్దగా కలిసి రాలేదు. సీక్వెల్స్ ప్రయత్నాలు కోలీవుడ్ లో చాలా రేర్ గానే జరుతుంటాయి. అలా జరిగినా? ఏనాడు సానుకూల ఫలితాలు దక్కలేదు. `రోబో`కీ సీక్వెల్ గా `రోబో 2.0` చేసారు. వందల కోట్లు ఖర్చు చేసి శంకర్ దీన్ని తెరకెక్కించారు. కానీ వాటిని ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' కి కూడా రెండు భాగాలు రిలీజ్ చేసారు.
కానీ మొదటి భాగం సక్సెస్ అయినంతగా రెండవ భాగం సక్సెస్ కాలేదు. అలాగే 'భారతీయుడు' కి సీక్వెల్ గా శంకర్ 'ఇండియన్ -2' కూడా చేసారు. ఈ సినిమా కూడా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఇలా మణిరత్నం, శంకర్ కు సీక్వెల్స్ ఏమాత్రం కలిసి రాలేదు. దీంతో శంకర్ 'ఇండియన్ 3' విషయంలో తర్జన భర్జన పడుతోన్న సంగతి తెలిసిందే. ఇలా కోలీవుడ్ కి సీక్వెల్స్ అన్నది శాపంగా మారింది.
అయితే ఇప్పుడా సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సిన బాధ్యత వీళ్లపైనే ఉంది. 'జైలర్' కి సీక్వెల్ గా 'జైలర్ 2' తెరకెక్కిస్తున్నాడు నెల్సన్ దిలీప్. అలాగే 'తని ఒరువన్' కి సీక్వెల్ గా రెండవ భాగం కూడా రెడీ అవుతుంది. కార్తీ హీరోగా 'సర్దార్ -2' కూడా తెరకెక్కుతోంది. ఇంకా విశాల్ హీరోగా 'డిటెక్టివ్-2' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే లోకేష్ కనగరాజ్ 'ఖైదీ'కి సీక్వెల్గా 'ఖైదీ -2' కూడా మొదలు పెడుతున్నాడు.
ఈ సినిమాలన్నింటిపై భారీ అంచనాలున్నాయి. తొలి భాగాలు భారీ విజయం సాధించడంతో? అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. మరోవైపు ప్లాప్ సెంటిమెంట్ కూడా వీటిని వెంటాడుతుంది. మరి ఆ భయాన్ని పటాపంచల్ చేయాల్సింది వీళ్లే. ఈ సినిమాలన్నీ ఈ రెండేళ్ల కాలంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.