కోలీవుడ్‌లో పద్మ పురస్కారాలు అందుకున్న స్టార్లు!
మద్రాసు కేంద్రంగా తమిళ సినిమా అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన ప్రముఖ నటులు పద్మ పురస్కారాలతో గొప్ప గౌరవం అందుకున్నారు.
By: Tupaki Desk | 29 Jan 2025 8:45 AM GMTమద్రాసు కేంద్రంగా తమిళ సినిమా అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన ప్రముఖ నటులు పద్మ పురస్కారాలతో గొప్ప గౌరవం అందుకున్నారు. లెజెండరీ నటుల ప్రభావం తెరకు మించి విస్తరించి తమిళ సంస్కృతి, సమాజాన్ని ప్రభావితం చేసింది. భారతీయ సినిమా గౌరవాన్ని ప్రపంచ స్థాయికి పెంచిన పరిశ్రమగా తమిళ చిత్రసీమ గౌరవం అందుకుంటోంది. గౌరవనీయమైన పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించబడిన కోలీవుడ్ దిగ్గజ నటుల వివరాల్లోకి వెళితే...
లెజెండరీ శివాజీ గణేషన్, కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్, అజిత్ కుమార్, ప్రభుదేవా, వివేక్ వంటి స్టార్లు ఉన్నారు. దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ చిత్ర పరిశ్రమ అభివృద్ధి, దాతృత్వంలో చేసిన అపారమైన కృషికి 1976లో పద్మశ్రీ .. 1984లో పద్మభూషణ్‌తో సత్కారం అందుకున్నారు. తన శక్తివంతమైన నటన, బహుముఖ ప్రజ్ఞతో తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చిన మేటి నటుడిగా కీర్తినందుకున్నారు. ఆయన వారసత్వం సినీపరిశ్రమలో స్టార్లుగా కొనసాగుతున్నారు. ఆయన భారతీయ సినీరంగంలోని గొప్ప నటులలో ఒకరిగా ఉన్నారు.
జెమినీ గణేషన్ 1970 ల నాటి మేటి కథానాయకుడు. తమిళ సినిమాల్లో తనదైన నటనతో శాశ్వత ముద్ర వేసిన ప్రముఖ నటుడు. ఆయన 1971లో పద్మభూషణ్‌తో సత్కారం అందుకున్నారు. ఎంకే రాధా అలియాస్ మద్రాస్ కంధసామి రాధాకృష్ణ తమిళ నాటక రంగం సినీరంగంలో అద్భుత కృషికి గాను 1970లో పద్మభూషణ్‌ను అందుకున్నారు.
విశ్వనటుడు కమల్ హాసన్ అసాధారణ కెరీర్ ఆరు దశాబ్దాలకు పైగా అజేయంగా కొనసాగుతోంది. అతడికి 1990లో పద్మశ్రీ , 2014లో పద్మభూషణ్ అవార్డులు లభించాయి. బహుముఖ ప్రజ్ఞావంతుడైన కమల్ హాసన్ కెరీర్ లో చేయని ప్రయోగం లేదు. ఆయన విభిన్న పాత్రలలో నటించారు. చాలా కోణాల్లో భారతీయ సినిమాకు కమల్ చేసిన కృషికి ప్రశంసలు అందుకున్నారు. కళ, సినిమాపై ఆయన అంకితభావం చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఆరేళ్ల వయసులోనే రాష్ట్రపతి చేతులమీదుగా బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
దేశంలోని పాపులర్ కథానాయకుల్లో ఒకరైన రజనీకాంత్ సినీ రంగంపై చూపిన ప్రభావం అసాధారణమైనది. 2000లో పద్మభూషణ్ , 2016లో పద్మవిభూషణ్ ఆయన అందుకున్నారు. 2019లో దాదాసాహెబ్ ఫాల్కేతోను గౌరవం అందుకున్నారు. రజనీ నటప్రతిభ, వినయవిధేయతలు, ఒదిగి ఉండే స్వభావం ..సరిహద్దులను దాటి ప్రపంచ సూపర్‌స్టార్‌గా మార్చాయి.
మేటి కథానాయకుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ మరణానంతరం జనవరి 2024లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. విజయకాంత్ తమిళ సినిమాకు చేసిన విప్లవాత్మక కృషికి, ముఖ్యంగా చట్టాన్ని అమలు చేసేవారు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించే సామాజిక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. సామాజిక, యాక్షన్ డ్రామాల్లో ఎనర్జిటిక్ పాత్రలతో అతడు పాపులరయ్యారు. విజయ్ కాంత్ పురట్చి కలైగ్నర్ (విప్లవాత్మక కళాకారుడు) బిరుదును పొందారు. అతడి ప్రభావవంతమైన సినిమాలు అభిమానులు, ఫిలింమేకర్స్ ని ప్రేరేపించాయి.
తళా అజిత్ కుమార్ కోలీవుడ్ లో అసాధారణ మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2025 పద్మ పురస్కారాల్లో ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌తో సత్కారం అందుకున్నారు. కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలతో మెప్పించిన తళా క్రీడాకారుడు కూడా. ఇటీవల దుబాయ్ రేస్ లో అతడి టీమ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ తర్వాత కోలీవుడ్ లో ఆ స్థానాన్ని అందుకున్న మాస్ హీరోగా అజిత్ కి గుర్తింపు ఉంది.
కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారిన ప్రభుదేవా సినీపరిశ్రమకు చేసిన కృషి అసాధారణమైనది. వేలాది పాటలకు కొరియోగ్రఫీ చేయడమేగాక, నటుడిగా, దర్శకుడిగా విశిష్ఠ సేవల్ని అందించారు. అలాగే హాస్యనటుడు వివేక్ వందలాది చిత్రాల్లో తనదైన హాస్యంతో మెప్పించారు. ఆ ఇద్దరినీ పద్మ పురస్కారాలతో కేంద్రం గౌరవించింది.
తమిళ సినీపరిశ్రమలో పలువురు తారలు గతంలో పద్మ పురస్కారాలను అందుకున్నారు.