వెనుకబడిపోయిన తమిళ హీరోలు!
సౌత్ లో అత్యధిక సినిమాలు రూపొందించే చిత్ర పరిశ్రమ కోలీవుడ్. ఇటీవల కాలంలో బాక్సాఫీసు దగ్గర తమిళ చిత్రాల సందడి బాగా తగ్గిపోయింది
By: Tupaki Desk | 2 July 2024 7:16 AM GMTగత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాపై సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత, దక్షిణాది చిత్రాల హవా ప్రారంభమైంది.. ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. బాలీవుడ్ చిత్రాలు మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకోడానికే ఇబ్బందులు పడుతుంటే, మన సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. థియేటర్లలోనే కాదు, ఓటీటీ వేదికలపైనా సత్తా చాటుతున్నాయి. కాకపోతే తెలుగు, మలయాళ చిత్రాల మాదిరిగా తమిళ సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నాయి.
సౌత్ లో అత్యధిక సినిమాలు రూపొందించే చిత్ర పరిశ్రమ కోలీవుడ్. ఇటీవల కాలంలో బాక్సాఫీసు దగ్గర తమిళ చిత్రాల సందడి బాగా తగ్గిపోయింది. గడిచిన ఆరు నెలల్లో పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేసే ఒక్క సినిమా కూడా రాలేదు. 2024లో ఇప్పటి వరకూ 124 తమిళ చిత్రాలు ప్రేక్షకుల ముందుకి వస్తే, వాటిల్లో కేవలం 7 సినిమాలు మాత్రమే హిట్ స్టేటస్ అందుకున్నాయంటే కోలీవుడ్ సక్సెస్ రేట్ ఎలా ఉందో అర్థమవుతుంది.
ధనుష్ హీరోగా నటించిన 'కెప్టెన్ మిల్లర్'.. విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ'.. విజయ్ ఆంటోనీ 'రోమియో' చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. 'అరణ్మనై 4' 'గరుడన్' 'లవర్', 'స్టార్', 'పీటీ సార్' లాంటి మరో నాలుగు చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కానీ ఇవేవీ భారీ కలెక్షన్లు రాబట్టి, పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటలేదు. వీటితో పాటుగా గత 6 నెలల్లో రిలీజైన క్రేజీ తమిళ సినిమాలేవీ సక్సెస్ అవ్వలేదు. అదే సమయంలో కొన్ని మలయాళ, తెలుగు చిత్రాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'కల్కి 2898 AD' సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు సాధిస్తూ, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇది కచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా ఓవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు.. మరోవైపు హై టెక్నికల్ వాల్యూస్ చిత్రాలతో టాలీవుడ్, మాలీవుడ్ లు టాక్ ఆఫ్ ది ఇండస్టీగా మారిపోయాయి. క్వాలిటీ ఔట్ పుట్స్ తో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను పెంచుతున్నాయి. కానీ ఈ విషయంలో కోలీవుడ్ బాగా వెనుకబడిపోయింది.
అయితే రాబోయే ఆరు నెలల్లో కోలీవుడ్ నుంచి పలు భారీ తమిళ చిత్రాలు రాబోతున్నాయి. కమల్ హాసన్ నటించిన 'ఇండియన్ 2', ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' సినిమాలు ఈ నెలలోనే విడుదల కాబోతున్నాయి. చియాన్ విక్రమ్ 'తంగలాన్' ఆగస్టులో.. విజయ్ 'గోట్' మూవీ సెప్టెంబర్ లో రానున్నాయి. రజనీకాంత్ 'వెట్టయాన్', సూర్య 'కంగువ' సినిమాలు దసరా స్పెషల్ గా అక్టోబర్ లో రిలీజ్ అవుతున్నాయి. శివ కార్తికేయన్ 'అమరన్', అజిత్ కుమార్ 'విదా ముయార్చి' చిత్రాలు కూడా లైన్ లో ఉన్నాయి. 2024 సెకండాఫ్ లో రాబోయే ఈ తమిళ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి, మళ్ళీ కోలీవుడ్ ను ట్రాక్ లోకి తీసుకొస్తాయేమో చూడాలి.