Begin typing your search above and press return to search.

'దేవర 3'.. కొరటాల ఏం చెప్పారంటే?

''దేవరలో ఇంకా చాలా పెద్ద కథ ఉంది. దేవర పార్ట్-1 జస్ట్ బిగినింగ్ అంతే సెకండ్ పార్ట్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

By:  Tupaki Desk   |   10 Oct 2024 5:47 AM GMT
దేవర 3.. కొరటాల ఏం చెప్పారంటే?
X

'ఆచార్య'తో భారీ డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ కొరటాల శివ.. 'దేవర 1' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు. తనను ట్రోల్ చేసిన వారితోనే శభాష్ అనిపించుకున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కొరటాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'దేవర' పార్ట్-2 గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

'దేవర 2'లో వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటదని, వర వీర విహారం చూస్తారని కొరటాల శివ తెలిపారు. ''దేవరలో ఇంకా చాలా పెద్ద కథ ఉంది. దేవర పార్ట్-1 జస్ట్ బిగినింగ్ అంతే. సెకండ్ పార్ట్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. చాలా పాత్రలు వేరే షేప్ తీసుకుంటాయి. వర అనే వాడు ఎంత ధైర్యవంతుడు అనేది సినిమాలో మిగిలిన పాత్రల్లో ఎవరికీ తెలియదు. వారి మధ్య డ్రామా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. దేవర-2లో వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటుంది. పార్ట్-2లో వర వీర విహారం'' అని అన్నారు.

'దేవర 1' ఇంటర్వెల్ ట్విస్ట్ గురించి కూడా కొరటాల శివ మాట్లాడారు. దేవర, వర మధ్య జరిగే సన్నివేశం చాలా ఎమోషనల్‌గా ఉంటుందని చెప్పారు. దేవర కథలు వింటూ పెరిగిన వర.. అమితంగా ఇష్టపడే తన తండ్రి గుండెల్లోకి ఎందుకు కత్తి దింపాల్సి వచ్చిందో తెలియజెప్పే సన్నివేశాలు ఎమోషనల్ గా ఉంటాయని తెలిపారు. అంత పెద్ద త్యాగం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? దేవర గురించి వర ఏం కథ రాసాడు? అసలు దేవరను ఏం చేసాడు? వంటి అంశాలు పార్ట్-2లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని కొరటాల హామీ ఇచ్చారు. 'దేవర' సినిమాకు ఒక డైరెక్టర్ గా కంటే ఒక రైటర్ గా ఎక్కువ ఎంజాయ్ చేసానని అన్నారు.

దేవరలో ప్రతీ పాత్రను క్రియేట్ చేయడాన్ని, ఇంట్రెస్టింగ్ పాయింట్స్, డ్రామా రాయడాన్ని బాగా ఎంజాయ్ చేశానని కొరటాల శివ చెప్పారు. 'దేవర' పార్ట్-3 ఉండదని దర్శకుడు స్పష్టం చేసారు. ఒక కథను చెప్పాలనుకున్నానే తప్ప, దేవరను ఒక ఫ్రాంచైజీగా తీసుకురావాలని అనుకోలేదని అన్నారు. ఒక మంచి కథను చెప్పాలి.. ఆ కథలో మంచి పాత్రలు ఉండాలి.. ఆ పాత్రలను ఎక్స్ట్రార్డినరీగా ముగించాలి అని అనుకున్నానన్నారు. ఏ కథనైనా తాను ఒక్క భాగంలోనే చెప్పాలనుకుంటానన్నారు. కానీ 'దేవర' చాలా పెద్ద కథ అవడం, ఎక్కువ పాత్రలు ఉండటం వల్ల మూడు గంటల్లో ఒక సినిమాగా చెప్పడం కష్టమైందని, అందుకే రెండు భాగాలుగా తీయాల్సి వచ్చిందని కొరటాల చెప్పుకొచ్చారు.

‘దేవ‌ర‌’ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. జాన్వీ క‌పూర్‌ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీఖాన్‌, ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్‌, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మించారు.