ఫ్యాన్స్ వద్దన్నా.. కొరటాల మాత్రం అదే పట్టు..
ఇటీవల కొరటాలకు రెండు, మూడు పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్లు వచ్చాయని, కానీ ఆయన వాటిని తిరస్కరించారని ఇండస్ట్రీ టాక్.
By: Tupaki Desk | 8 March 2025 5:00 PM IST‘దేవర’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టినా, ఎన్టీఆర్ అభిమానుల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది. కథ, మేకింగ్ విషయంలో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్, అనిరుధ్ మ్యూజిక్ మాత్రమే సినిమా ప్లస్ పాయింట్స్ అయ్యాయని ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అయితే దర్శకుడు కొరటాల శివ మాత్రం ఈ సిరీస్‌పై పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ‘దేవర 2’ పూర్తి చేసిన తర్వాతే వేరే ప్రాజెక్ట్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట.
ఇటీవల కొరటాలకు రెండు, మూడు పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్లు వచ్చాయని, కానీ ఆయన వాటిని తిరస్కరించారని ఇండస్ట్రీ టాక్. వీటిలో టాప్ హీరోలతో కలిసి భారీ స్థాయిలో సినిమాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ‘దేవర 2’ స్క్రిప్ట్‌ను పక్కాగా తయారు చేయడమే తన ప్రాధాన్యతగా ఆయన భావిస్తున్నారని సమాచారం. అయితే ఎన్టీఆర్ మాత్రం వరుసగా ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ‘దేవర 2’ షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే ‘దేవర 2’ తర్వాత వచ్చే సినిమాలు మరింత పెద్ద స్థాయిలో ఉంటాయని అర్థమవుతోంది. బాలీవుడ్ మార్కెట్‌ను పక్కాగా టార్గెట్ చేస్తూ ‘వార్ 2’ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మరొకవైపు ప్రశాంత్ నీల్‌తో కలిసి మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే తారక్ మరో మూవీ చేసేందుకు సిద్ధం అవుతాడు. కానీ అప్పటికి ‘దేవర 2’ హైప్ ఏమిటి? ప్రేక్షకుల్లో అంచనాలు ఏవిధంగా ఉంటాయి? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్టీఆర్ అభిమానుల్లో చాలా మందికి ‘దేవర 2’పై ఆసక్తి తగ్గిపోయిందని తెలుస్తోంది. కారణం ఏంటంటే మొదటి పార్ట్ విషయంలో వచ్చిన మిశ్రమ స్పందన. ముఖ్యంగా కొరటాల శివ గత రెండు సినిమాల పనితీరు మెుదలుకుని, ఆయన మేకింగ్ స్టైల్ వరకూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అందుకే ఎన్టీఆర్ బిగ్ బడ్జెట్ కమర్షియల్ సినిమాల వైపు వెళ్ళాలని కోరుకుంటున్నారు. మరోవైపు కొరటాల మాత్రం ‘దేవర 2’ని మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దాలని ఫిక్స్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో కొరటాల శివ మరింత కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రణ్వీర్ సింగ్‌ను కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు టాక్. ఇప్పటికే సైఫ్ అలీఖాన్‌ను మొదటి పార్ట్‌లో విలన్‌గా తీసుకున్నారు. ఇప్పుడు రెండో భాగంలో మరింత బలమైన క్యారెక్టర్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో పేరును పరిశీలిస్తున్నారు. కానీ అసలు ‘దేవర 2’ ఉంటుందా? ఉంటే అదే లెవెల్లో ఆసక్తిని క్రియేట్ చేయగలదా? అనేది అసలు ప్రశ్న.
కొరటాల శివ తనవంతుగా ‘దేవర 2’ స్క్రిప్ట్‌ను మరింత గ్రిప్పింగ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ తన కెరీర్‌ను ఇంకా భారీ స్థాయిలో మలుచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ‘దేవర 2’కి క్లారిటీ రావడానికి ఇంకా కొంత సమయం పట్టొచ్చు. తారక్ తన ప్రస్తుతం ప్రాజెక్టులు పూర్తిచేసేంతవరకు కొరటాల వెయిట్ చేయాల్సిందే. ఫైనల్‌గా ‘దేవర 2’ ఎంతవరకు నిజమవుతుందో వేచిచూడాలి.