Begin typing your search above and press return to search.

కొరటాల కామెంట్స్.. ఒక్కొక్కరు ఒక్కోలా..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Aug 2024 2:18 PM GMT
కొరటాల కామెంట్స్.. ఒక్కొక్కరు ఒక్కోలా..
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్టర్ గా మారిన ఆయన ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కమర్షియల్ స్టోరీలకు సామాజిక అంశాలను యాడ్ చేస్తూ.. తన సినిమాలతో మెప్పిస్తుంటారు కొరటాల శివ. అలాంటి సినిమాలు తీయడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ జోనర్ లో వచ్చిన జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి.

ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్న ఆయన.. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ హోస్ట్ చేసిన పాడ్ కాస్ట్ కు అటెండ్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో పన్ను చెల్లింపుదారుల హక్కుల గురించి కొరటాల చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిలో పడ్డాయి. దానిపై నెట్టింట ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

టాక్స్ పేయర్లకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉండాలని పాడ్ కాస్ట్ లో వ్యాఖ్యానించారు. అందుకు ఉదాహరణగా ఎయిర్ పోర్ట్ తో తాను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సంఘటనను గుర్తు చేసుకున్నారు కొరటాల. "సాధారణంగా నేను ఎప్పుడైనా లైన్ లోనే ఉంటాను. ఎయిర్ పోర్ట్ కు అయితే రెండు గంటల ముందే వెళ్తాను. కానీ ఓ సారి తన షెడ్యూల్ ఫుల్ టైట్ గా ఉండడం వల్ల కాస్త లేట్ గా వచ్చాను. నా చెక్- ఇన్ వేగంగా అవ్వడానికి ఓ అధికారి నన్ను సైడ్ నుంచి తీసుకెళ్లారు" అని కొరటాల తెలిపారు.

"ఆ సమయంలో లైన్ లో ఉన్న ఓ వ్యక్తి నన్ను చూసి అరిచారు. దీంతో నాకూ కోపం వచ్చి.. నేను కూడా అరిచాను. ఏటా రూ.4 కోట్ల పన్ను చెలిస్తున్నా. కాబట్టి కనీస ప్రత్యేక హక్కు నాకు ఉండదా అని గట్టిగా అన్నాను. దీంతో కొందరు ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. టాక్స్ పేయర్లకు ప్రత్యేక అధికారాల విషయంపై కూడా ఓ అధికారిని కూడా అడిగాను. కోట్లకు కోట్లు టాక్స్ కట్టే మాలాంటి వాళ్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఉండాలి. అలా ఉంటే ఆ లైన్ చూసి మరికొందరు స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది. నేను కూడా ఎప్పటికైనా ఆ లైన్ లో నిలబడాలి అని అనుకుంటారు.. అని చెప్పుకొచ్చారు కొరటాల శివ.

అయితే కొరటాల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. కొందరు నెటిజన్లు.. ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. కొరటాల చెప్పినట్లు టాక్స్ పేయర్లకు ప్రత్యేక అధికారాలు ఉండాలని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మాత్రం అలా కరెక్ట్ కాదని చెబుతున్నారు. ఏదేమైనా మొత్తానికి ఆయన కామెంట్స్ ఇండస్ట్రీతో పాటు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.