డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన క్రిష్
తాజా మీడియా సమాచారం మేరకు.. దర్శకుడు క్రిష్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణకు సహకరించారని తెలిసింది.
By: Tupaki Desk | 2 March 2024 3:34 AM GMTహైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీపై పోలీసుల రైడ్, అనంతరం పలువురు పట్టుబడిన కేసులో అరెస్టుల ఫర్వం గురించి తెలిసిందే. ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో పలువురు విచారణకు సహకరించలేదని కథనాలొచ్చాయి. ప్రముఖ నిర్మాత కుమారుడు అమెరికాకు పరారీ అయ్యారని ఇప్పటికే కథనాలు రాగా, దర్శకుడు క్రిష్ విచారణకు హాజరు కాలేదని కూడా వార్తలు వచ్చాయి.
అయితే తాను స్థానికంగా అందుబాటులో లేనని, ముంబైలో ఉన్నందున కొంత సమయం కావాలని దర్శకుడు క్రిష్ పోలీసులను అభ్యర్థించారు. ఇప్పటికే అతడు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని కూడా కథనాలొచ్చాయి. ఈ కేసులో ఎనిమిదో పేరుగా క్రిష్ పేరు నమోదు అయిందని వార్తలు వచ్చాయి.
తాజా మీడియా సమాచారం మేరకు.. దర్శకుడు క్రిష్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణకు సహకరించారని తెలిసింది. అతడి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షకు పంపారు. డ్రగ్స్ సేవించినట్టు తేలితే అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసింది. అయితే తన పేరును ఈ కేసులోకి అనవసరంగా డ్రాగ్ చేసారని, పార్టీలో పట్టుబడ్డ ఒక వ్యక్తిని కలిసి తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని క్రిష్ తెలిపారు.
పరిచయస్తులను కలిసేందుకే:
ఫిబ్రవరి 25న హోటల్ గదిలో కొకైన్ సేవించినందుకు నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ సహా పలువురు పట్టుబడినట్టు కథనాలొచ్చాయి. విచారణ ఎదుర్కొన్న వ్యక్తులతో క్రిష్‌కు ఉన్న స్నేహం కారణంగా పోలీసులు అతడిని విచారణకు పిలిచారని ప్రచారమైంది. ఈ ఆరోపణలపై స్పందించిన క్రిష్, కేవలం పరిచయస్తులను కలవడానికే హోటల్‌కు వెళ్లానని, అరగంటసేపు మాత్రమే తాను అక్కడ ఉన్నానని మీడియాకు తెలిపాడు. తాను ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్లాక ఆ విషయాన్ని తన ఆచూకీ గురించి వెతుకుతున్న అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నాడు.
దర్యాప్తు లో భాగంగా అధికారులు హోటల్ డ్రగ్ బస్ట్ కేసులో క్రిష్ ప్రమేయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, పోలీసులు అనుమానితుల జాబితాలో ఒక కార్ డ్రైవర్ .. డ్రగ్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ సహా మరో ఇద్దరి పేర్లను చేర్చినట్లు కథనాలొస్తున్నాయి. ఫిబ్రవరి 26 నుంచి తప్పిపోయిన నటి లిషి గణేష్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.