కృష్ణ భగవాన్ కి అవకాశాలు రాకపోవడం వెనుక కారణం అదా?
హీరో సంగతి పక్కనబెడితే? సినిమాలో కృష్ణ భగవాన్ కామెడీ మాత్రం హైలైట్ అనేది ప్రతీ సినిమాలో కనిపించేది.
By: Tupaki Desk | 31 July 2024 2:45 AM GMTఒకప్పటి స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్ గురించి పరిచయమవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడీయన్లు ఉన్నా హాస్యంలో తనకంటూ ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడాయన. నటుడి గా మూడు దశాబ్ధాల ప్రయాణం ఆయనది. ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేసారు. హీరో సంగతి పక్కనబెడితే? సినిమాలో కృష్ణ భగవాన్ కామెడీ మాత్రం హైలైట్ అనేది ప్రతీ సినిమాలో కనిపించేది. అంతగా తెలుగు సినిమాల్లో ఆయన ముద్ర పడింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కెరీర్ జర్నీ గురించి, సినిమాల్లో అవకాశాలు తగ్గడం పై స్పందించారు. `కాలేజ్ రోజుల్లో నాటకాలు వేసేవాడిని. మిమిక్రీ చేసేవాడిని. అదే నన్ను వంశీ వరకూ తీసుకెళ్లింది. `మహర్షి` సినిమా నుంచి వంశీతో నా సాన్నిహిత్యం పెరిగింది. వెట కారమనేది గోదావరి నీళ్లలోనే ఉంది. అందువల్లనే అది నాకూ వచ్చింది. సినిమాల పరంగా నాకు చాలా హెల్ప్ అయింది. తొలి నుంచీ నేను సరదా మనిషిని.
సినిమాల్లోకి రాకముందే, ఏదైనా పనిపై బయటికెళ్లి వచ్చినప్పుడు 'రామానాయుడుగారు గానీ .. రాఘవేంద్ర రావుగారు గాని కాల్ చేశారా?' అని ఇంట్లో వాళ్లను అడిగేవాడిని. అప్పుడు వాళ్లు నవ్వుతూ `రామోజీరావుగారు చేశారు` అనేవారు. ఒక రోజున నిజంగానే నా కోసం రామానాయుడు గారు కాల్ చేశారు. ఆ రోజును .. ఆ క్షణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఇదే మాటను రామానాయుడిగారితోను చెప్పాను.
నేను సరదాగా మాట్లాడతాను. జోవియల్ గా ఉంటాను. కానీ పెద్దగా లౌక్యం తెలియదు. నాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి అదే కారణమని నేను అనుకుం టున్నాను. కమెడియన్స్ లో రఘుబాబుతో .. హీరోల్లో అల్లరి నరేష్ తో ఎక్కువ చనువుగా ఉంటాను. నటుడిగా ఈ రోజున ఈ స్థాయి గుర్తింపును సంపాదించుకోవడం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నాను` అని అన్నారు.