Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : కృష్ణమ్మ

By:  Tupaki Desk   |   10 May 2024 10:01 AM GMT
మూవీ రివ్యూ : కృష్ణమ్మ
X

'కృష్ణమ్మ' మూవీ రివ్యూ

నటీనటులు: సత్యదేవ్-అతిర రాజ్-అర్చన-లక్ష్మణ్ మీసాల-కృష్ణ బూరుగుల తదితరులు

సంగీతం: కాలభైరవ

ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి

నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి

రచన-దర్శకత్వం: వీవీ గోపాలకృష్ణ

నటుడిగా చాలా మంచి పేరు సంపాదించిన సత్యదేవ్.. హీరోగా ఓ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. అతను లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం 'కృష్ణమ్మ' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ వీవీ గోపాలకృష్ణ రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

విజయవాడలోని వించిపేట ప్రాంతంలో అనాథలుగా పెరిగి పెద్దయిన కుర్రాళ్లు భద్ర (సత్యదేవ్).. శివ (కృష్ణ బూరుగుల).. కోటి (లక్ష్మణ్ మీసాల). చిన్నపుడే ఓ నేరం మీద జైలుకు వెళ్లొచ్చిన శివ.. తప్పుడు పనులకు దూరంగా ఉంటూ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని బతుకుతుంటాడు. శివ.. కోటి మాత్రం గంజాయి అమ్ముతూ.. ఇంకా చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటారు. శివ.. అతను ప్రేమించిన అమ్మాయి కోసం భద్ర-కోటి మారిపోయి ఈ పనులన్నీ పక్కన పెట్టేస్తారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తారు. ఇలా వీరి జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో.. అత్యవసర పరిస్థితుల్లో ఈ ముగ్గురు మిత్రులూ ఓ గంజాయి డీల్ చేయాల్సి వస్తుంది. అందుకోసం వెళ్లి తిరిగొస్తున్న సమయంలో పోలీసులకు దొరికిపోతారు. దీంతో వీరి జీవితాలు అనూహ్యమైన మలుపు తిరుగుతాయి. ఓ తప్పుడు కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఆ కేసేంటి.. అందులో వీళ్లను ఇరికించిందెవరు.. దాన్నుంచి బయటపడ్డారా లేదా.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.


కథనం-విశ్లేషణ:

కమర్షియల్ హంగుల గురించి ఆలోచించకుండా కథను కథగా చెప్పాలని చూసే దర్శకులు కొద్ది మందే ఉంటారు. ఇలా సిన్సియర్ గా చెప్పే కథలు ఎక్కువమందికి రీచ్ కావన్న భయాలున్నప్పటికీ రాజీ పడకుండా ప్రయత్నం చేస్తారు. కొత్త దర్శకుడు వీవీ గోపాలకృష్ణ కూడా 'కృష్ణమ్మ'లో అదే చేశాడు. పెద్ద వాళ్ల మీద కేసులు మాఫీ చేసే క్రమంలో అమాయకులను బలివ్వడానికి పోలీసులు ఎలాంటి కుట్రలు చేస్తారనే కోణంలో ఓ బరువైన కథను అతను చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసు ఆధారంగా కథను తీర్చిదిద్దుకున్న గోపాలకృష్ణ.. దాన్ని తెర మీద బాగానే ప్రెజెంట్ చేశాడు. కాకపోతే అసలు పాయింట్ ను చాాలా ఇంటెన్స్ గానే చెప్పినప్పటికీ.. ప్రేక్షకులు మరీ కొత్తగా ఫీలయ్యే అంశాలేమీ ఇందులో లేవు. కమర్షియల్ సినిమాల ఫార్మాట్ ను ఫాలో కాకపోవడం భిన్నంగానే అనిపించినా.. ఇది చివరికి సగటు రివెంజ్ డ్రామాను తలపించడంతో ప్రేక్షకులకు మిశ్రమానుభూతి కలుగుతుంది. కానీ ఒక్కసారి చూసేందుకు ఢోకా లేని చిత్రమే ఇది.

మనోహరం.. షాక్.. లాంటి పాత సినిమాలతో పాటు ఈ మధ్యే వచ్చిన కన్నడ చిత్రం 'సప్త సాగరాలు దాటి'లతో పోల్చదగ్గ ప్లాట్ పాయింట్ తో సాగే సినిమా 'కృష్ణమ్మ'. తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన ఒక చిన్న నేేరంతో పోలీసులకు దొరికిన ముగ్గురు కుర్రాళ్లను.. ఓ రాజకీయ నాయకుడి కొడుకు తన మిత్ర బృందం చేసిన ఘోరానికి బాధ్యులుగా మార్చి పోలీసులు-మిగతా వ్యవస్థ వారి జీవితాలతో ఎలా ఆటలాడుకుందో చూపిస్తూ ఇంటెన్స్ గా కథను నడిపించాడు దర్శకుడు. అనాథలుగా ఎన్నో డక్కా మొక్కీలు తిని పెరిగిన ముగ్గురు కుర్రాళ్ల జీవితాల్లో ఒక మంచి మార్పు వచ్చి వారికి భవిష్యత్తు పట్ల ఒక ఆశ రేగిన తరుణంలో.. వచ్చే ఒక కుదుపుతో ఎలా వారి జీవితాలు తలకిందులయ్యాయో చూస్తాం. ప్రధాన పాత్రలను ఎస్టాబ్లిష్ చేసేందుకు దర్శకుడు కొంచెం ఎక్కువ సమయమే తీసుకోవడంతో ప్రథమార్ధం కొంచెం నెమ్మదిగానే నడుస్తుంది. అనాథ కుర్రాళ్లకు సమాజంలో ఎదురయ్యే పరిస్థితులు.. సరైన మార్గనిర్దేశం లేకుంటే వాళ్లెలా దారి తప్పుతారు.. ఓ అవకాశం వస్తే వాళ్లు మారడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారు.. ఈ విషయాలను కొంచెం హృద్యంగా చూపించారు. కానీ కథలో మలుపు కోసం ప్రేక్షకులు చాలా సమయం ఎదురు చూడాల్సి వస్తుంది.

గంజాయి కేసులో పోలీసులకు దొరికిపోయిన హీరో అండ్ కో.. అసలు కేసేంటో కూడా తెలియకుండా అమ్మాయిపై అత్యాచారం-హత్య కేసులో నేరం ఒప్పేసుకుని అందులో పీకల్లోతు మునిగిపోయే క్రమాన్ని దర్శకుడు ఉత్కంఠ రేకెత్తించేలా నడిపించాడు. పోలీసులు ఇలాంటి కేసుల్లో ఎంత దారుణంగా.. అన్యాయంగా వ్యవహరిస్తారు అన్నది కళ్లకు కట్టినట్లు తెరపై చూపించాడు. 'కృష్ణమ్మ'లో హైలైట్ గా నిలిచేది ఈ ఎపిసోడే. కథకు సంబంధించిన కీలకమైన ట్విస్ట్.. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలిస్తాయి. ప్రి ఇంటర్వెల్ నుంచి.. ప్రి క్లైమాక్స్ వరకు సినిమాను దర్శకుడు మంచి టెంపోతో నడిపించాడు. ఐతే హీరో-తన మిత్రుడు జైలు నుంచి బయటికి వచ్చాక ఏం చేస్తారన్నది ఊహించడం కష్టమేమీ కాదు. సగటు రివెండ్ డ్రామాల స్టయిల్లోనే కథ నడవడంతో తర్వాత ఏమంత ఆసక్తి ఉండదు. పోలీస్ అధికారి కథను ముగించే ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగా సాగుతుంది. మిగతా వ్యవహారమంతా మామూలే. ఓవరాల్ గా చూస్తే కథలో మరీ కొత్తదనం లేకపోయినా.. దాన్ని నరేట్ చేసిన విధానంలో ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. కొంచెం రా అండ్ రస్టిగ్గా సాగే సీరియస్ కథలను ఇష్టపడేవారికి 'కృష్ణమ్మ' మంచి ఆప్షనే. కానీ సగటు కమర్షియల్ సినిమాల నుంచి ఆశించే అంశాలు మాత్రం ఇందులో పెద్దగా కనిపించవు.


నటీనటులు:

సత్యదేవ్ మంచి పెర్ఫామర్ అని చాలా సినిమాల్లో రుజువైంది. 'గాడ్ ఫాదర్'లో మెగాస్టార్ చిరంజీవినే డామినేట్ చేసిన నటుడతను. 'కృష్ణమ్మ'లో భద్ర పాత్రలోనూ అతను అద్భుతంగా నటించాడు. ఆవేశంతో కూడిన అనాథ పాత్రకు ప్రాణం పోశాడు. కోపంతో చిటపటలాడిపోతూనే.. తన వాళ్ల కోసం ఏదైనా చేసే పాత్రలో అతడి నటన హృద్యంగా అనిపిస్తుంది. ప్రతీకారంతో రగిలిపోయే.. పగ తీర్చుకునే సన్నివేశాల్లోనూ చాలా బాగా నటించాడు. ఆద్యంతం తన నటనలో ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది. సత్యదేవ్ తర్వాత బాగా ఆకట్టుకునేది లక్ష్మణ్ మీసాల. ఎప్పుడూ హీరో పక్కనే ఉండే పాత్రలో అతను చక్కగా ఒదిగిపోయాడు. మరో ఫ్రెండు పాత్రలో కృష్ణ బూరుగుల కూడా ఓకే. కీలకమైన లేడీ క్యారెక్టర్లో అతిర రాజ్ బాగా చేసింది. హీరోయిన్ లాగా కాకుండా ఒక ముఖ్య పాత్రధారిలా తన స్క్రీన్ ప్రెజెన్స్.. నటన ఆకట్టుకుంటాయి. పోలీస్ అధికారి పాత్రలో చేసిన నటుడు విలనీని బాగా పండించాడు. మిగతా నటీనటులంతా ఓకే.


సాంకేతిక వర్గం:

'కృష్ణమ్మ'కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. కాలభైరవ సినిమాలోని ఇంటెన్సిటీకి తగ్గట్లే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రేక్షకులు సన్నివేశాల్లో లీనమయ్యేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. పాటలు పర్వాలేదు. సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని చోట్ల బడ్జెట్ పరిమితులు తెరపై కనిపిస్తాయి. కానీ ఇలాంటి కథకు అండగా నిలిచిన నిర్మాతలు అభినందనీయులు. రైటర్ కమ్ డైరెక్టర్ వీవీ గోపాలకృష్ణ.. తొలి ప్రయత్నంలో ఒక సాహసోపేతమైన కథనే ఎంచుకున్నాడు. అతను సిన్సియర్ గా.. రాజీ పడకుండా ఓ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. కాకపోతే తన నరేషన్ మాత్రం నెమ్మదిగా అనిపిస్తుంది. ప్రథమార్ధంలో అనవసర సన్నివేశాలు తగ్గించి.. కథనాన్ని ఇంకొంచెం క్రిస్ప్ గా తీర్చిదిద్దుకుని ఉండాల్సింది. స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవాల్సింది. తొలి ప్రయత్నంలో దర్శకుడిగా అతడికి ఓ మోస్తరు మార్కులు పడతాయి.

చివరగా: కృష్ణమ్మ.. మంచి ప్రయత్నం

రేటింగ్- 2.5/5