Begin typing your search above and press return to search.

ఆ మహా మహర్షికి నేనొక శిష్యుడిని..!

సిరివెన్నెల గారి గురించి చెప్పమంటే దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ అర్ధాకలితో గడిపిన రోజులు.. అరిగిన చెప్పులతో అరికాళ్ల పగుళ్లు జీవితంలో ఆయనకు ఎన్నో నేర్పించాయి.

By:  Tupaki Desk   |   9 July 2024 5:33 AM GMT
ఆ మహా మహర్షికి నేనొక శిష్యుడిని..!
X

సిరివెన్నెల సినిమాతో తొలి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న గేయ రచయిత ఆయన. సిరివెన్నెల సాహిత్యం గురించి ఆయన ప్రస్థానం గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువే. సినీ సాహిత్యానికి ఒక మార్క్ సెట్ చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా ఆయనతో ఉన్న అనుభవాలను సెలబ్రిటీస్ ఈటీవీలో ప్రసారం అవుతున్న నా ఉచ్చ్వాసం కమలం కార్యక్రమంలో పంచుకుంటున్నారు. లేటెస్ట్ గా ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ అటెండ్ అయ్యి సిరివెన్నెల గారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

సిరివెన్నెల గారి గురించి చెప్పమంటే దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ అర్ధాకలితో గడిపిన రోజులు.. అరిగిన చెప్పులతో అరికాళ్ల పగుళ్లు జీవితంలో ఆయనకు ఎన్నో నేర్పించాయి. ఖాళీ జేబుని బరువైన పర్సుని ఆయనకి జీవితం ఏంటో చూపించాయి. విరుద్ధ భావజాలం కలిగిన ముగ్గురు వ్యక్తులు సిరివెన్నెల సీతారామశాస్త్రి, యండమూరి వీరేంద్రనాథ్, రాం గోపాల్ వర్మ ఈ ముగ్గురి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు డైరెక్టర్ కృష్ణవంశీ.

సినిమాకు పాట అవసరమా.. ఉంటే అది ఎంతవరకు అంటే.. కృష్ణవంశీ సమాధానం ఇస్తూ.. సినిమాకు పాట అవసరమా కాదా అని చెప్పే స్థాయి ఉందనుకోవట్లేదుదు. పర్సనల్ గా పాటలంటే ఇష్టం. చూడటం కూడా ఇష్టమే. పాటలేకుండా సినిమా అంటే అంతగా ఇష్టం ఉండదు. కేవలం పాటలతోనే సినిమా తీయమంటే తీస్తానని అన్నారు కృష్ణవంశీ. అంతేకాదు జీవితానికి పాటలు చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

శాస్త్రి గారితో పరిచయం మొదలైన ప్రయాణం గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ.. సిరివెన్నెల గారితో ప్రయాణం అనడం కన్నా అనుసరణ అంటే బాగుంటుందని అన్నారు. ఆయనతో పరిచయం వెరైటీగా జరిగిందని అన్నారు. డిగ్రీ పూర్తి చేసి శంకరాభరణం సినిమా చూసిన దగ్గర నుంచి విశ్వనాథ్ గారి సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నా.. ఆ సినిమాలో హీరో అంధుడు, హీరోయిన్ మూగమ్మాయి అంతగా నచ్చలేదు కానీ మ్యూజిక్ అద్భుతం చేసింది. ఆ సినిమాకు వేటూరి గారి సాహిత్యం అనుకున్నా కానీ సీతారామ శాస్త్రిగారని తర్వాత తెలిసింది. ఆయన ఒకసారి ఒక పాటలో దేవుడిని తిట్టారు. అది చాలా లాజికల్ గా అనిపించింది. ఆయన నుంచి ప్రతి పాట జీవితం గురించి తెలిసేలా చేస్తుంది అందుకే ప్రతిపాట వినడం మొదలు పెట్టా అని అన్నారు కృష్ణవంశీ.

తాను అసిస్టెంట్ గా చేస్తున్న టైం లో శాస్త్రి గారికి సినిమా గురించి వివరించి నన్ను చూసుకోమని డైరెక్టర్ వెళ్లిపోయారు. ఆయన పనిలో ఉంటే కాస్త మంచినీళ్లు, టీ తీసుకురా బాబు అన్నారు. ఆయన తనని హౌస్ బాయ్ అనుకున్నారని అర్థమైంది. అప్పుడు తానేమి ఈగోకి పోలేదు శాస్త్రిగారిని మొదటిసారి అప్పుడే దగ్గరగా చూశానని అన్నారు కృష్ణవంశీ. ఆ తర్వాత మేమిద్దరం కలిసి శివ, క్షణ క్షణం, అంతం మూవీ టైం లో శాస్త్రి గారితో స్నేహం ఏర్పడిందని అన్నారు కృష్ణవంశీ.

అరగంటలో పాట రాసిన విషయం గురించి కృష్ణవంశీ చెబుతూ.. మనీ మనీ సినిమాకు శాస్త్రి గారితో లిరిక్స్ రాయించాలని అనుకున్నాం.. ఆయన కేవలం అరగంటలోనే ఆ పాటలు రాసిచ్చారు. తనకు తెలిసినంతవరకు పాటకి అన్యాయం చేయడానికి శాస్త్రి గారు ఇష్టపడరు. నైతిక విలువల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు.. ఆయన నిత్య పరిమళాలు వెదజల్లే పువ్వు లాంటి వారని. వేరే లిరిక్ రైటర్ రాసిన లిరిక్స్ బాగుంటే వెంటనే ఫోన్ చేసి అభినందిస్తారు ఎలాంటి గర్వం లేని వ్యక్తి ఆయన అని కృష్ణవంశీ అన్నారు.

సింధూరం సినిమాకు రిలీజ్ రెండు రోజుల ముందు పాట రాయించిన సందర్భం గురించి వివరిస్తూ.. సింధూరం సినిమా చూశాక శాస్త్రి గారు హాల్ లో అటు ఇటు తిరుగుతూ పేపర్ ఉందా అని అడిగారు. లేదని అక్కడ ఒక సిగరెట్ పెట్ట ఉంటే ఇచ్చా.. అది తీసుకుని ఏదో రాసుకుని ఆ తర్వాత ఇంటికెళ్లి అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని సాంగ్ రాసిచ్చారు. ఆయన ఇచ్చిన ఆ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. ఇదే కాదు గులాబీలో ఈవేళలో నీవు సాంగ్ కూడా సిరివెన్నెల గారు ఒక్క రాత్రిలోనే రాసిచ్చారు.

సీతారామశాస్త్రి గారితో ప్రయాణం గురించి కృష్ణవంశీ చెబుతూ.. కాస్త నాటకీయంగా ఉంటుందేమో కానీ నా జన్మకి దొరికిన ఒక గొప్ప అదృష్టం ఆయన. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటి గొప్ప వారితో పరిచయం జరగదు. ఒక గంధం చెట్టు కిందకి పిచ్చి ఆకు గాలికి కొట్టుకొచినట్టు నేను కూడా ఆయన గాలి పరిమళం వల్లే ఇంతవాడినయ్యాను. గత జన్మలో ఆయన ఓ మహర్షి ఐతే ఆయన దగ్గర శిష్యుడిగా చేశానేమో ఈ జన్మలో ఆయనతో అంత అనుబంధం ఏర్పడిందని అన్నారు కృష్ణవంశీ.