డ్రగ్స్ కేసులో క్రిష్ శాంపిల్స్ రిపోర్ట్ ఇదే!
అయితే క్రిష్ తొలి నుంచి తాను ఈ పార్టీలో ఎక్కువ సమయం గడపలేదని చెబుతున్నారు. ప్రారంభంలో కేవలం 30 నిమిషాల పాటు పార్టీలో ఉన్నానని, అటుపై అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపారు.
By: Tupaki Desk | 4 March 2024 5:50 PM GMTఇటీవల హైటెక్ సిటీలోని రాడిసన్ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీకి వెళ్లిన దర్శకుడు క్రిష్ కొద్దిరోజుల మెలో డ్రామా అనంతరం పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. క్రిష్ నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించగా, ఇందులో నెగెటివ్ వచ్చిందని సమాచారం. ఇది దర్శకుడు క్రిష్ కి స్వల్ప ఉపశమనం.
అయితే క్రిష్ తొలి నుంచి తాను ఈ పార్టీలో ఎక్కువ సమయం గడపలేదని చెబుతున్నారు. ప్రారంభంలో కేవలం 30 నిమిషాల పాటు పార్టీలో ఉన్నానని, అటుపై అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపారు. తాను ముంబైలో ఉండటం వల్ల పోలీసుల ఎదుట హాజరుకాలేకపోయానని అన్నారు. కానీ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు.
విచారణ నిమిత్తం శుక్రవారం సైబరాబాద్ పోలీసుల ఎదుట హాజరైన ఆయన రక్త, మూత్ర నమూనాలను అందించారు. పరీక్షల్లో క్రిష్‌కి నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. గతంలో నగరంలోని హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్‌తో పాటు మరో 9 మందిపై పోలీసులు కేసు పెట్టారు. 37 ఏళ్ల గజ్జల వివేకానంద్, సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ, నిర్భయ్, కేదార్‌తో పాటు మరో ఆరుగురి పేర్లను వెల్లడించారు. వివేకానంద్, కేదార్, నిర్భయ్‌లకు పాజిటివ్‌గా తేలింది.
ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న నటి లిషి గణేష్ ఈరోజు విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరయ్యారు. కాగా తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను క్రిష్ ఉపసంహరించుకున్నారు. తనకు నెగెటివ్ రావడం వల్ల పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే వీల్లేదు గనుక క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.