Begin typing your search above and press return to search.

కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ బ్యూటీ!

దీంతో ఈ భామకి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో తన అదృష్టాన్ని పరిక్షించుకోడానికి రెడీ అయింది.

By:  Tupaki Desk   |   11 March 2024 12:30 AM
కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ బ్యూటీ!
X

'సూపర్ 30' అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన కన్నడ కస్తూరీ కృతి శెట్టి.. 'ఉప్పెన' చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా మేనల్లుడికి జోడీగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో కృతికి ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చింది. పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి అర డజనుకు పైగా క్రేజీ ఆఫర్లు అమ్మడి తలుపు తట్టడంతో, తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ బ్యూటీకి ఇటీవల కాలంలో ఏదీ కలిసిరాలేదు. బ్యాక్ టూ బ్యాక్ పరాజయాలు పలకరిస్తున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడే ఉప్పెనలా దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా కిందకి జారిపోయింది. దీంతో కృతి ఇప్పుడు తమిళ, మలయాళ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

నిజానికి 'ఉప్పెన' తర్వాత కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఆ టైంలో ఆమెకున్న డిమాండ్ మేరకు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ గా అందుకున్నట్లు టాక్ నడిచింది. అయితే 'ది వారియర్' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారి అమ్మడి స్పీడుకు బ్రేకులు వేసింది. ఆ తర్వాత వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' లాంటి మరో రెండు చిత్రాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. ఎన్ని హోప్స్ పెట్టుకున్న 'కస్టడీ' సినిమా సైతం ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. దీంతో ఈ భామకి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో తన అదృష్టాన్ని పరిక్షించుకోడానికి రెడీ అయింది.

కృతి శెట్టి ప్రస్తుతం కోలీవుడ్ హీరో కార్తీ సరసన 'Karthi 26' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి నలన్‌ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి 'వా వాతియారే' అనే పేరు ప్రచారంలో ఉంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే టైటిల్‌ & ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది కృతికి ఫస్ట్ స్ట్రెయిట్ తమిళ్ సినిమా. దీంతో పాటుగా 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' అనే మరో తమిళ్ మూవీలో నటిస్తోంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ కు జోడీగా కనిపించనుంది. అలానే 'జెనీ' మూవీలో జయం రవికి జంటగా నటిస్తోంది కృతి.

ఇదే క్రమంలో 'అజయంతే రందం మోషణం' అనే మలయాళ మూవీతో మాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది కృతి శెట్టి. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ లో టివినో థామస్ హీరోగా నటిస్తున్నారు. ఇలా అమ్మడి చేతిలో ప్రస్తుతం మూడు తమిళ్ ప్రాజెక్ట్స్, ఒక మలయాళ మూవీ ఉన్నాయి. తెలుగులో మాత్రం 'మనమే' సినిమా ఒక్కటే ఉంది. ఇందులో ఆమె టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్‌ కి జోడీగా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దీనికి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఇటీవలే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి, ఫస్ట్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలు హిట్టయితే మళ్లీ ఎప్పటిలాగే కృతి కెరీర్ తెలుగులో పుంజుకునే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.