Begin typing your search above and press return to search.

బేబమ్మ పరిస్థితి ఏంటి భయ్యా...!

మనమే సినిమాలో కృతి శెట్టి పాత్ర గొప్పగా ఉండటం, ఆ పాత్ర వల్ల ఆమె కెరీర్‌ మరింత స్పీడ్‌ అందుకోవడం వంటి అద్భుతాలు ఏమీ జరగలేదు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 5:41 AM GMT
బేబమ్మ పరిస్థితి ఏంటి భయ్యా...!
X

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా టైటిల్‌ మాదిరిగానే కృతి శెట్టి కెరీర్‌ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసింది. అంతే స్పీడ్ గా కింద పడింది. రెండేళ్లలో ఈ అమ్మడికి వరుస ఫ్లాప్స్ తలుపు తట్టాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.


కాస్త గ్యాప్ తర్వాత ఈ బేబమ్మ 'మనమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్‌ హీరోగా రూపొందిన మనమే సినిమాకి ఓ మోస్తరు వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే మనమే సినిమా వల్ల కృతి శెట్టికి కలిసి వచ్చిందేమీ లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది.

మనమే సినిమాలో కృతి శెట్టి పాత్ర గొప్పగా ఉండటం, ఆ పాత్ర వల్ల ఆమె కెరీర్‌ మరింత స్పీడ్‌ అందుకోవడం వంటి అద్భుతాలు ఏమీ జరగలేదు. దాంతో కృతి శెట్టి టాలీవుడ్‌ లో కొత్త ఆఫర్లు దక్కించుకోవడం మరింత కష్టం అన్నట్లుగా పరిస్థితి మారింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేయని కృతి శెట్టి తమిళం మరియు మలయాళంలో మాత్రం ఒకొక్కటి చొప్పున చేస్తూ ఉంది. ఆ రెండు సినిమాలు హిట్‌ అయ్యి అక్కడ వరుసగా ఆఫర్లు వస్తే మళ్లీ తెలుగు లో కృతి శెట్టిని చూసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఆమెను టాలీవుడ్‌ మళ్లీ చూసే అవకాశం లేదు అనే చర్చ జరుగుతుంది.

మరో వైపు పెళ్లి సందడి సినిమాతో తెలుగు లో అడుగు పెట్టిన శ్రీలీల మాత్రం దూసుకు పోతుంది. ఇద్దరూ ఒకేసారి టాలీవుడ్ లో అడుగు పెట్టడంతో పాటు, ఇద్దరికి ఒకేసారి స్టార్‌ డం దక్కింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉన్న విషయం అందరికి తెల్సిందే.

శ్రీలీల చేతిలో నాలుగు అయిదు తెలుగు సినిమాలు ఉంటే కృతి శెట్టి మాత్రం తెలుగు లో ఒక్క సినిమా చేయడం లేదు. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను ఓకే చెప్పకుండా కథ విషయంలో, ఇతర విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఖచ్చితంగా కృతి శెట్టి కెరీర్‌ ఇలా ఉండేది కాదేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.