కెరీర్‌లో చెత్త దశ గురించి జాతీయ అవార్డ్ నటి
తన కెరీర్ లో 'బరేలీ కి బర్ఫీ' షూటింగ్ పూర్తయిన తర్వాత, 15 నెలల పాటు తన వైపు ఆసక్తికరమైన సినిమాల్లో అవకాశాలేవీ రాలేదని కృతి చెప్పింది.
By: Tupaki Desk | 26 Oct 2024 7:16 AM GMTకృతి సనోన్ పరిచయం అవసరం లేదు. 1 నేనొక్కడినే- దోచేయ్ లాంటి తెలుగు సినిమాలతో సుపరిచితురాలు. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ లో సీతగా నటించింది. మిమీ చిత్రంలో తన నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. బాలీవుడ్ లో క్రూ సినిమాతో కమర్షియల్ గా బంపర్ హిట్టు అందుకుని వరుస చిత్రాలతో ఇప్పుడు దూకుడుగా ఉంది కృతి.
అయితే తన కెరీర్‌లో ఒక చెత్త దశ గురించి కృతి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన సినిమా దోపట్టీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న కృతి చాలా తెలియని విషయాలను బయటకు చెబుతోంది.
తన కెరీర్ లో 'బరేలీ కి బర్ఫీ' షూటింగ్ పూర్తయిన తర్వాత, 15 నెలల పాటు తన వైపు ఆసక్తికరమైన సినిమాల్లో అవకాశాలేవీ రాలేదని కృతి చెప్పింది. చాలా కాలం విశ్రాంతి తీసుకున్నాను. నిరుత్సాహంగా అనిపించింది. ప్రజలు తనను మరచిపోవచ్చనే ఆందోళన చెందానని చెప్పింది. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కృతి సనన్ తాజా పాడ్ కాస్ట్ లో పలు ఆసక్తికర విషయాలను ముచ్చటించారు. తన కెరీర్ జర్నీ సహా పరిశ్రమలో బయటి వ్యక్తిగా ఎదుర్కొన్న సవాళ్ల గురించి కృతి మాట్లాడింది. కొన్నిసార్లు పరిశ్రమలో బంధుప్రీతి పాత్ర ఎలా ఉంటుందో చెప్పింది. హీరోపంతి, దిల్‌వాలే, మిమి, క్రూ వంటి చిత్రాల గురించి మాట్లాడింది.
కృతి తన కెరీర్‌లోని ఒక చెత్త దశ గురించి మాట్లాడింది. 15 నెలల గ్యాప్ లో అవకాశాలు వచ్చిన వారిలో కొందరి కంటే తానే ఎక్కువ ప్రతిభావంతురాలిని అని భావించిన సందర్భాలు ఉన్నాయని, కానీ తనను విస్మరించారని కృతి పేర్కొంది. ఒక నటి లేదా నటుడు సినిమా నేపథ్య కుటుంబం నుండి కానప్పుడు పరిశ్రమలోని వ్యక్తులు వారిని గుర్తించడానికి చాలా సమయం తీసుకుంటారని .. చివరికి వారికి ఇవ్వాల్సిన పాత్రలను ఇస్తారని చెప్పింది. తన కుటుంబం నుంచి సపోర్ట్ లభించకపోవడంతో ఇండస్ట్రీకి వచ్చాక ఏదీ అంత ఈజీ కాలేదని కృతి వాపోయింది. అయితే అదే సమయంలో తనతో పోల్చితే ఇతరుల అభివృద్ధి అంత సులువు కాదని, పరిశ్రమలో ఒక విధమైన గుర్తింపు కోసం తాను కష్టపడ్డానని చెప్పింది.
ఒక నటి లేదా నటుడి విజయానికి ప్రతిభ లేదా మార్కెటింగ్ ముఖ్యమా? అని హోస్ట్ కృతిని అడిగారు. ప్రతిభ చాలా ముఖ్యమైనది అని కృతి నమ్మకంగా స్పందించింది. మార్కెటింగ్ ఒక నటుడి దృష్టిని ఒకటి లేదా రెండు సార్లు ఆకర్షించడంలో సహాయపడవచ్చు. కానీ నటన అనేది ప్రతిభపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.. అని తెలిపింది.
ప్రేక్షకులు చాలా తెలివైనవారు.. ఎవరైనా ప్రతిభావంతులు కాకపోతే, వారి పేరు వెనుక ఎంత మార్కెటింగ్ ఉన్నప్పటికీ ఎక్కువ కాలం నిలబడలేరు.. అని తెలిపింది. కృతి ఇంకా మాట్లాడుతూ చాలా మంది సినిమా కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు. అయితే వారికి అవసరమైన ప్రతిభ లేదనే కారణంగా ఇంకా విజయవంతం కాలేదు.. అని వెల్లడించింది.