పదేళ్ల ప్రయాణంలో నటికి సవాళ్లు, అవమానాలా?
తాజాగా తన పదేళ్ల జర్నీని ఉద్దేశించి ఇవే సంఘటనలు గుర్తు చేసుకుంది. అయితే ఇలా సక్సస్ అవ్వడానికి కారణంగా తన పని మాత్రమే అంటోంది.
By: Tupaki Desk | 23 Jun 2024 4:30 PM GMTబాలీవుడ్ లో కృతి సనన్ కెరీర్ ఇప్పుడే రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే 'ది క్రూ'తో మరో భారీ సక్సస్ ఖాతాలో వేసుకుంది. మరో ఇద్దరు ముగ్గురు భామలతో కలిసి నటించినా సోలో గానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగల నటి అని ప్రూవ్ చేసుకుంది. దీంతో అమ్మడికిప్పడు ఆ రకమైన అవకాశాలు వరిస్తున్నాయి. అంతకుముందు జాతీయ ఉత్తమ నటిగానూ అవార్డులు..రివార్డులు అందుకుంది.
ఇదంతా ఇప్పుడు. మరి ఒకప్పుడు కృతి కెరీర్ ఎలా సాగిందంటే? బాలీవుడ్ లో ఛాన్సు కూడా రాలేదు. అమ్మడి తొలి పరిచయం తెలుగు సినిమాతోనే జరిగింది. మహేష్ హీరోగా నటించిన 'వన్' సినిమాలో నటించింది. ఆ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పరాజయం చెందింది. అటుపై బాలీవుడ్ లో 'హీరోపంటి' అనే సినిమా చేసింది. ఆ సినిమా బాగానే ఆడింది. కానీ అనుకున్న విధంగా అవకాశాలు రాలేదు.
ఇదే క్రమంలో తెలుగులో నాగచైతన్య సరసన 'దోచెయ్' లో నటించింది. ఇది కూడా ప్లాప్ అయింది. దీంతో తెలుగు పరిశ్రమలో అమ్ముడు ఐరన్ లెగ్ అనే విమర్శ ఎదుర్కుంది. అటు బాలీవుడ్ లోనూ సరైన అవకాశాలు రాక, వచ్చినా అవి సరిగ్గా ఆడకపోవడంతో కొన్నాళ్ల పాటు బ్యాడ్ ఫేజ్ ని చూసింది. రకరకాల విమర్శలు, సవాళ్లు, అవమానాలు ఎన్నో ఎదుర్కుంది.ముఖ్యంగా సొంత బాలీవుడ్ పరిశ్రమే తనని చిన్న చూపుగా చూసిందనే భావన పలుమార్లు వ్యక్త పరిచే ప్రయత్నంచేసింది.
తాజాగా తన పదేళ్ల జర్నీని ఉద్దేశించి ఇవే సంఘటనలు గుర్తు చేసుకుంది. అయితే ఇలా సక్సస్ అవ్వడానికి కారణంగా తన పని మాత్రమే అంటోంది. ఎన్ని విమర్శలు , అవమానాలు ఎదురైనా పని చేసుకుంటూ వెళ్లిపోవడం వల్లే ఈ రోజు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాను అంది. తాను నమ్మిన కష్టం, ప్రతిభ మాత్రమే అవకాశాలు కల్పిస్తుందని చెప్పుకొచ్చింది. ఏ పని చేసినా అది వృత్తిగతమైనది అయినా ..వ్యక్తిగతమైనా అంకిత భావంతో పనిచేయడం ముఖ్యమని ఈ పదేళ్ల జర్నీలో ఎంతో తెలుసుకున్నాని తెలిపింది.