కొన్నిసార్లు వాళ్లను చూసి విసుగు చెందాను!- కృతి
చాలాసార్లు తన స్థాయికి తగ్గ అవకాశాలు పొందలేకపోయినందున నిరాశ చెందానని తెలిపింది.
By: Tupaki Desk | 9 April 2024 12:30 AM GMTఒకానొక దశలో తన ప్రతిభకు తగ్గ అవకాశాలు రాకపోవడంపై ఆదిపురుష్ బ్యూటీ కృతి సనోన్ తీవ్రంగా నిరాశ చెందానని తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఇటీవలే జాతీయ అవార్డ్ అందుకున్న ఉత్సాహంలో ఉన్న కృతి సనన్ ప్రస్తుతం `క్రూ` విజయంతో సెలబ్రేషన్ మోడ్‌లో ఉంది. ఈ ఉగాది తనకు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తోంది. కొలీగ్స్ టబు, కరీనాతో ఫుల్ గా పార్టీ చేసుకునే మూడ్‌లో ఉంది. అయితే తాజా ఇంటర్వ్యూలో కృతి తన కెరీర్‌లో హెచ్చు తగ్గుల గురించి ప్రస్థావించింది. కృతి తాజాగా ప్రముఖ హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ కిడ్స్ మంచి అవకాశాలు పొందుతారని, కానీ వారు నిరూపించలేనప్పుడు తాము విసుగు చెందుతామని అంగీకరించింది. చాలాసార్లు తన స్థాయికి తగ్గ అవకాశాలు పొందలేకపోయినందున నిరాశ చెందానని తెలిపింది.
నేను చాలా చంచలంగా ఉన్న ఒక దశ ఉంది. ఎందుకంటే నా ముందు ఉన్న అవకాశాలలో నా స్థాయికి తగ్గవి లేవని నాకు తెలుసు. నేను డెప్త్ ఉన్న నటన కోరుకున్నాను. నటిగా నా సామర్థ్యాన్ని మరింత ఎక్కువగా చూపించగలిగేది కావాలని కోరుకున్నాను. మనకు చిన్న పాత్ర(గిన్నె)ను ఇస్తే దానికి సరిపడే నీటిని మాత్రమే తీసుకెళ్లగలం. పెద్ద బరువున్న పాత్ర (గిన్నె)ను ఇస్తే మనం మరింత నింపగలం.. మోయగలం... ఒక పెద్ద పాత్ర ఇస్తే దానికి తగ్గట్టు నీటిని నింపుతాం. పాత్ర పెద్దదయ్యే కొద్దీ నీరు ఎక్కువ పోయవచ్చు. అందుకే నేను చాలా కాలం పాటు ఆ బడా పాత్ర కోసం వెతికాను. కానీ ఇప్పటికి ఆ టైమ్ వచ్చింది.. అని తెలిపింది.
నేను చేయగలను అనుకునే మంచి పాత్ర నాకు రానప్పుడు నిరుత్సాహానికి గురయ్యాను. ఎందుకంటే నేను ఆ పాత్రను చేయగలనని నాకు తెలుసు. దానిని చంపగలనని తెలుసు. కానీ నా ముందు ఆ అవకాశం లేదు. ఆ సమయంలో కొన్ని కొత్త ముఖాలను చూశాను. వారిలో కొందరు సినిమా నేపథ్యానికి చెందినవారు.. నటవారసురాళ్లున్నారు. వాళ్లు ఆడిషన్‌లో ఏమీ చేయకపోవటం చూశాను.. అయినా నాకు నచ్చిన అవకాశాలు రావడం ఎలానో అర్థమయ్యేది కాదు!! అని కృతి వ్యాఖ్యానించింది.
టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన చిత్రంతో కృతి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చివరిగా కరీనా కపూర్, టబు, దిల్జిత్ దోసాంజ్, కపిల్ శర్మ కీలక పాత్రల్లో నటించిన రాజేష్ ఎ కృష్ణన్స్ `క్రూ`లో కనిపించింది. తదుపరి తన హోమ్ ప్రొడక్షన్ `దో పట్టి`లో కనిపించనుంది. నటిగా నిర్మాతగా ఎదిగేందుకు కృతి ఇటీవల తీవ్రంగా శ్రమిస్తోంది.