కేఆర్కే కొత్త వివాదం.. ఈసారి షారూఖ్ కొడుకుపైనా
కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాడు అంటే కచ్ఛితంగా ఆయన అభిమానుల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంటుంది.
By: Tupaki Desk | 25 Feb 2025 3:20 PM GMTకింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాడు అంటే కచ్ఛితంగా ఆయన అభిమానుల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంటుంది. బాద్ షా రేంజు అది. దశాబ్ధాల పాటు కింగ్‌లా బాక్సాఫీస్ ని ఏలిన షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ త్వరలో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు అనగానే అందరిలోను ఒకటే ఆసక్తి.
అయితే తండ్రి షారూఖ్ లా నటుడు కాకుండా, ఆర్యన్ ఖాన్ దర్శకుడు అవుతున్నాడు. అతడు కెమెరా వెనక కెప్టెన్ హ్యాట్ ధరించాడు. ఆర్యన్ తెరకెక్కించిన కొత్త వెబ్‌సిరీస్ `ది బా*డ్స్ ఆఫ్ బాలీవుడ్` రాక కోసం పరిశ్రమ వర్గాలు సహా అభిమానులు, సామాన్య ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్‌తో ఆర్యన్ పనితనం ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్కంఠ అందరిలోను ఉంది.
సరిగ్గా ఇలాంటి సమయంలో వివాదాస్పద బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కేఆర్కే అభిప్రాయం ప్రకారం.. ఆర్యన్ తెరకెక్కిస్తున్న ఈ షో ఒక డిజాస్టర్.. ఆర్యన్ ఖాన్ దర్శకత్వం ఈ దశాబ్దంలోనే పరమచెత్త. తన స్నేహితులు కూడా దీనిని భరించలేరు`` అని ఘోరంగా విమర్శించాడు.
అయితే కేఆర్కే విశ్లేషణలను ప్రజలు ఎవరికీ పట్టించుకునేంత తీరిక లేదు. అతడు కేవలం సోషల్ మీడియా సెన్సేషన్ గా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు వివాదాలతో అంట కాగడం ద్వారా తనకు తాను పబ్లిసిటీ కోరుకుంటాడు. ఇంతకుముందు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సహా ప్రభాస్, రణబీర్ వంటి స్టార్లపైనా అతడు రకరకాల కామెంట్లు చేసాడు. వారి సినిమాలను దారుణంగా విమర్శించాడు. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే దీనికి నెగెటివ్ పబ్లిసిటీ ప్రారంభించాడు.
నిజానికి జనం కేఆర్కే రివ్యూలను ఏనాడో లైట్ తీస్కున్నారు. ఇప్పుడు అతడు చేసే ఏ ప్రకటనా చెల్లుబాటు కాదు! అతడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే అతడు తాజా కామెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు అన్నది నిజం. వెబ్ సిరీస్ ఇంకా రిలీజ్ కాకుండా ఎన్ని గాసిప్పులు అయినా వండి వార్చవచ్చు. కానీ గాసిప్పుల్లో నిజాన్ని చూడలేం. ఆర్యన్ ఖాన్ దర్శకత్వ ప్రతిభ ఎలాంటిది? అనేది నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ విడుదలయ్యాక మాత్రమే చెప్పగలం.
``ది బా*డ్స్ ఆఫ్ బాలీవుడ్`` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సిరీస్ లలో ఒకటి. ఈ సిరీస్‌లో కొత్త తరం కథ గొప్ప వినోదం ఉంటుందని చెబుతున్నారు. ఇందులో భారీ తారాగణం కనిపిస్తారు. బాలీవుడ్ సెలబ్రిటీ లైఫ్ ని ఆర్యన్ తెరపై చూపిస్తున్నాడు. అందువల్ల ఈ సిరీస్ పై బోలెడంత ఆసక్తి నెలకొంది. నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కి వచ్చాకే ఆర్యన్ పనితనం ఏమిటన్నది చూడగలం.