Begin typing your search above and press return to search.

ఇది కదా గొప్ప విషయమంటే.. కుమారి ఆంటీ తోపు బ్రో!

నెట్టింట ఎక్కడ చూసినా కొద్ది రోజుల పాటు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు సంబంధించిన పోస్టులే కనిపించాయి.

By:  Tupaki Desk   |   18 Sep 2024 2:22 PM GMT
ఇది కదా గొప్ప విషయమంటే.. కుమారి ఆంటీ తోపు బ్రో!
X

'మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్స్ ఎక్స్ ట్రా..' ఈ డైలాగ్ ఎక్కడ చిన్నగా విన్నా.. కుమారి ఆంటీ అందరికీ గుర్తుకు వచ్చేస్తోంది. హైదరాబాద్‌ లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని మంచి బిజినెస్ చేసుకుంటున్న ఆమె.. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఫుల్ ఫేమ‌స్ అయిపోయింది. నెట్టింట ఎక్కడ చూసినా కొద్ది రోజుల పాటు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు సంబంధించిన పోస్టులే కనిపించాయి. యూట్యూబ్ వ్లాగర్స్ నుంచి సెలబ్రిటీల వరకు నేరుగా వెళ్లి మరీ ఫుడ్ టేస్ట్ చేశారు.

అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయిన ఆమె ఫుడ్ స్టాల్ కు విపరీతంగా కస్టమర్స్ తరలివచ్చారు. ఇంకా కుమారి ఆంటీ షాప్ తెరవక ముందే.. క్యూలు కట్టారు. బైకులు, కార్లలో తరలివచ్చారు. దీంతో కుమారి ఆంటీ షాప్ ఉన్న ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. కుమారి ఆంటీపై కేసు నమోదు చేసి.. షాపును మూసివేశారు. వ్యాన్ ను కూడా సీజ్ చేశారు. ఆ సమయంలో కుమారి ఆంటీ వేదన అంతా ఇంతా కాదు!

ఆ సమయంలో సోషల్ మీడియాలో అనేక మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. అప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ స్టాల్‌ ను తీసేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత తానే స్వయంగా స్టాల్ ను సందర్శిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. అక్కడే బిజినెస్ చేసుకోమని సూచించారు. కేసును విత్ డ్రా చేసుకోమని పోలీసులకు కూడా ఆదేశించారు. దీంతో కుమారి ఆంటీ.. దిగ్విజయంగా ఇప్పుడు తన బిజినెస్ ను తాను చేసుకుంటోంది.

సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిన తర్వాత బుల్లితెరపై పలు టీవీ షోల్లో పాల్గొని సందడి చేసింది కుమారి ఆంటీ. అయితే తాజాగా తనలోని మరో గొప్ప వ్యక్తిని అందరికీ పరిచయం చేసింది. మనం సంపాదించిన దాంట్లో తమకు తోచినంత సహాయం చేయాలనే సందేశాన్ని తెలియజేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 వేల విరాళం అందజేసింది. దీంతో ఇప్పుడు ప్రశంసలు అందుకుంటుంది. తన చిన్న సహాయంతో మరోసారి సెలబ్రిటీల సరసన చేరింది కుమారి ఆంటీ.

ఇటీవల తెలంగాణలో కురిసిన వ‌ర్షాలు, వ‌ర‌దాల వ‌ల్ల భారీగా నష్టం జరిగిందన్న విషయం తెలిసిందే. దీంతో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు సామాన్యుల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు త‌మ వంతు సాయాన్ని అందించారు/ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసి ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ.50 వేలను విరాళంగా కుమారి ఆంటీ అందించింది. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి ఆమెను అభినందించి శాలువాతో సత్కరించారు.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. కుమారి ఆంటీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇది కదా గొప్పతనం అంటే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాను చేస్తున్నది చిన్న వ్యాపారమే.. కానీ వరద బాధితులకు అండగా నిలిచిందని కొనియాడుతున్నారు. ఎంతైనా కుమారి ఆంటీ తోపు అని చెబుతున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని అంటున్నారు. చివరగా.. హ్యాట్సాఫ్ కుమారీ ఆంటీ!!