రౌడీయిజం ప్రోత్సహించే సినిమాలు వద్దు
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు.
By: Tupaki Desk | 24 Dec 2024 11:10 AM GMTసంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉందని వైద్యులు అన్నారని, మెల్లగా కోలుకుంటున్నాడని చెప్పారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. బాలుడుని పరామర్శించిన తర్వాత వైద్యులతో, బాలుడి తండ్రి భాస్కర్‌తో కొంత సమయం మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పద్దతులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులకు తెలియజేశారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... తొక్కిసలాట సమయంలో బాలుడు గాయ పడటంతో వెంటనే పోలీసులు సీపీఆర్ చేయడం మంచిది అయ్యిందని వైద్యులు అన్నారు. పోలీసులు చేసిన సీపీఆర్ వల్లే బాలుడి ప్రాణాలు దక్కాయి. ఈ విషయంలో పోలీసు వారిని అభినందించారు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వివాదం మాదిరిగా సాగుతోంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కొందరు దీన్ని రాజకీయం చేయడం మంచిది కాదు, సినిమా రంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విలన్స్‌ను చూపించే విధానం మారాలి. విలన్స్‌ను హీరోలుగా చూపించడం, పోలీసులను తక్కువ చేసి చూపించడం మానుకోవాలి అన్నారు.
ఈ సంఘటన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వివరించారు. బౌన్సర్లు గూండాల మాదిరిగా ప్రవర్తించడం సరికాదు. బౌన్సర్లు ఇలా గూండాల మాదిరిగా వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో రూపొందిన కొన్ని సందేశాత్మక సినిమాలకు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఎందుకు ఇలా పోలీసులను తక్కువ చేసి చూపించడం, విలన్స్‌ను రౌడీలుగా చూపించిన సినిమాలకు ఈజీగా సెన్సార్ క్లియరెన్స్ వస్తుందని ఆయన ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో ముందు ముందు అయినా ఇలాంటి తప్పుడు సినిమాలు రావద్దని కోరుకుంటున్నాను అన్నారు.
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ రావడం, అక్కడ పెద్ద మొత్తంలో అభిమానులు గేదర్ కావడంతో తొక్కిసలాట జరిగింది. థియేటర్ లోనికి వెళ్లిన తర్వాత చాలా మంది టికెట్లు లేకండా లోపలికి రావడం జరిగింది. తద్వారా తొక్కిసలాట జరిగింది అంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శిస్తున్నారు.