కూతురు కోసం సీక్వెల్ ప్లాన్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్
శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.
By: Tupaki Desk | 10 March 2025 3:56 PM ISTదివంగత నటి శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఇప్పటికే పలు సినిమాల్లో నటించి టాలీవుడ్‌లోనూ దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ప్రస్తుతం జాన్వీ కపూర్ ఏకంగా రామ్ చరణ్‌తో కలిసి బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాతో జాన్వీ కపూర్‌కి పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డం దక్కడం ఖాయం. ఇండస్ట్రీలో ఇప్పటికే జాన్వీ కపూర్ పాతుకు పోయింది. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో జాన్వీ కపూర్ రాబోయే ఐదు ఆరు ఏళ్ల పాటు బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. హిందీలో ఇప్పటి వరకు ఖుషి కపూర్ మూడు సినిమాల్లో నటించింది. ఆ మూడు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. మొన్నటికి మొన్న ఒక సినిమాతో వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ఇండస్ట్రీలో ఖుషి కపూర్ నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్టార్ కిడ్స్‌కి సక్సెస్ రాకున్నా ఆఫర్లు వస్తూ ఉంటాయి. తద్వారా కొన్నాళ్ల తర్వాత అయినా సక్సెస్ దక్కి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఖుషి కపూర్‌కి తండ్రి నుంచి పెద్ద ఆఫర్ దక్కిందని తెలుస్తోంది.
ఖుషి కపూర్‌తో 'మామ్' సినిమాను సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు బోనీ కపూర్ ప్రకటించాడు. శ్రీదేవి చివరి సినిమాగా మామ్ నిలిచింది. ఆమె భర్త అయిన బోనీ కపూర్‌కి మామ్ సినిమా చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. అందుకే మామ్ సినిమాకు సీక్వెల్ చేయాలని కోరుకుంటున్న బోనీ కపూర్ అందులో తన చిన్న కూతురు ఖుషి కపూర్‌ను నటింపజేయాలని భావిస్తున్నాడట. బోనీ కపూర్ ఈమధ్య కాలంలో నిర్మాతగా వరుసగా హిట్ సినిమాలను రూపొందిస్తున్నాడు. కనుక మామ్ సినిమా సీక్వెల్ సైతం మంచి సబ్జెక్ట్‌తో నిర్మించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2017లో మామ్ మూవీ వచ్చింది. శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు రవి ఉద్యావర్ దర్శకత్వం వహించగా బోనీ కపూర్ నిర్మించారు. మామ్ మూవీ హిందీలోనే కాకుండా సౌత్ భాషల్లోనూ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మామ్ 2 పై అంచనాలు కేవలం హిందీలోనే కాకుండా సౌత్‌లోనూ ఉండే అవకాశం ఉంది. సౌత్ లో మామ్ 2 తో ఖుషి కపూర్ ఎంట్రీ ఇచ్చే విధంగా మంచి కథను రెడీ బోనీ చేయించాడని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఖుషి కపూర్‌కి మామ్ 2 సినిమా అత్యంత కీలకంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు అనే టాక్‌తో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక సినిమా మినిమం ఆడినా కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.