Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : లగ్గం

తెలుగు తెరపై ఇటీవల తెలంగాణ పల్లె కథల జోరు సాగుతోంది. ఈ కోవలోనే 'లగ్గం' అనే సినిమా తెరకెక్కింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 12:27 PM GMT
మూవీ రివ్యూ : లగ్గం
X

'లగ్గం' మూవీ రివ్యూ

నటీనటులు: సాయి రోనక్-ప్రగ్యా నగ్రా-రాజేంద్ర ప్రసాద్-రోహిణి-వడ్లమాని శ్రీనివాస్-రఘుబాబు-సప్తగిరి-కిరీటి-కృష్ణుడు-చమ్మక్ చంద్ర తదితరులు

సంగీతం: చరణ్ అర్జున్

నేపథ్య సంగీతం: మణిశర్మ

ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి

నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి

రచన-దర్శకత్వం: రమేష్ చెప్పాల

తెలుగు తెరపై ఇటీవల తెలంగాణ పల్లె కథల జోరు సాగుతోంది. ఈ కోవలోనే 'లగ్గం' అనే సినిమా తెరకెక్కింది. సాయి రోనక్-ప్రగ్యా నగ్రా జంటగా కొత్త దర్శకుడు రమేష్ చెప్పాల రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (సాయి రోనక్) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతడికి తన మేనమామ (రాజేంద్ర ప్రసాద్) కూతురైన మానస (ప్రగ్యా నగ్రా) అంటే చాలా ఇష్టం. అతడి మేనమామ ఒక రోజు హైదరాబాద్ వచ్చి అల్లుడి ఉద్యోగం.. జీతం.. తన వైభోగం అంతా చూసి తననే అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే కావడంతో ఇరు కుటుంబాల్లో అభ్యంతరాలేమీ ఉండవు. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతాయి. కానీ ఇంతలో పెళ్లికి అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. జరగాల్సిన సమయానికి పెళ్లి జరగదు. ఇందుకు కారణం అర్జునే అని తర్వాత తెలుస్తుంది. ఇంతకీ ఈ పెళ్లిని అతనెందుకు ఆపించాలనుకున్నాడు.. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి.. తర్వాత అయినా అర్జున్-మానస ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

మన దేశంలో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఉండే క్రేజే వేరు. ఐదంకెల జీతం.. విలాసవంతమైన జీవితం.. వారానికి రెండు రోజుల సెలవు.. విదేశీ ప్రయాణం.. అక్కడే సెటిలయ్యే అవకాశం.. ఇలా బోలెడన్ని సౌలభ్యాలుంటాయి. కానీ ఆ ఉద్యోగాల్లో ఉండే ఒత్తిడి.. ఉద్యోగ అభద్రత.. విదేశాల్లో పని చేస్తూ సొంత కుటుంబ సభ్యులతోనే బంధం కోల్పోవడం నాణేనికి రెండోవైపు కనిపించే కోణాలు. ఇలాంటి అనుకూలతలు-ప్రతికూలతలు చాలా వృత్తుల్లో.. ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి ఉండే క్రేజ్-డిమాండ్ వల్ల దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంటుంది. ఈ అంశాలను చాలా సినిమాల్లో ఇప్పటికే టచ్ చేశారు. ఐతే 'లగ్గం' సినిమాలో ఈ పాయింట్ మీదే పూర్తి కథను నడిపించేశారు. తన మేనల్లుడు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో ఉన్న సానుకూలతలు చూసి దాన్ని మించిన కొలువు లేదని ఫీలయ్యి అతడికి కూతురునిచ్చి పెళ్లి చేయబోయిన ఓ తండ్రి.. అతడిరా ఉద్యోగం పోయిందని తెలిస్తే ఎలా స్పందించాడనే నేపథ్యంలో 'లగ్గం' నడుస్తుంది. ఈ కథ ద్వారా మంచి విషయాలు చెప్పాలనుకోవడం.. సందేశం ఇవ్వాలనుకోవడం బాగానే ఉన్నా.. కథలో కొత్తదనం లేకపోవడం.. నరేషన్ ఓల్డ్ స్టయిల్లో సాగడం.. చాలా సన్నివేశాలు సాగతీతగా తయారవడం.. అన్నింటికీ మించి తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమాలో నేటివిటీకి తగ్గ నటీనటులను ఎంచుకోకపోవడం వల్ల ఈ 'లగ్గం' ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

'లగ్గం' కథ పూర్తిగా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో నడుస్తుంది. అలాంటపుడు అక్కడి యాసను సహజంగా పలికే.. అక్కడి మనుషుల్లా అనిపించే ఆర్టిస్టులను ముఖ్య పాత్రలకు పెట్టుకోవడం కీలకం. వేరే ప్రాంతాల ఆర్టిస్టులు ఇలాంటి సినిమాల్లో నటించకూడదన్న షరతులేమీ లేవు కానీ.. ఆంధ్ర యాసతో బాగా అలవాటైన నటీనటులు ఇలాంటి రూటెడ్ స్టోరీలో ముఖ్య పాత్రల్లో కనిపిస్తుంటే.. వారి యాసలో అసహజత్వం ఉట్టిపడుతుంటే ఆ క్యారెక్టర్లను ఓన్ చేసుకోవడం కొంచెం కష్టమే అవుతుంది.

తొలి గంటలో 'లగ్గం'లో కొత్తగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు పడలేదు . కథలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా ఏమీ ఉండదు. మేనమామకు తన మేనల్లుడు-అతను చేసే ఉద్యోగం నచ్చడం.. పెళ్లికి అందరూ పచ్చ జెండా ఊపేయడం.. ఆ తర్వాత పెళ్లికి ఏర్పాట్లు చేయడం.. ఇలా అంతా మామూలుగా నడిచిపోతుంది. తెలంగాణ పల్లెటూళ్లలో పెళ్లి తంతును కొంచెం వివరంగా చూపించడం మాత్రం కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక పెళ్లి ఆగిపోవడంతో ఇంటర్వెల్ దగ్గర కథ మలుపు తిరిగే ఎపిసోడ్ కూడా ఏమంత ఎఫెక్టివ్ గా అనిపించదు. పెళ్లి ఆగిపోవడానికి దారి తీసిన కారణం చూస్తే సిల్లీగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో తిరిగి హీరో హీరోయిన్లను కలిపి పెళ్లి చేయడం ఎలా అనే కోణంలో కథ నడుస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే రెండో అర్ధంలో ఎమోషన్లు పండాయి. కొన్ని సన్నివేశాలు హృద్యంగా సాగుతాయి. అక్కడక్కడా మంచి డైలాగులు కూడా పడ్డాయి. సెకండాఫ్ వరకు 'లగ్గం' పర్వాలేదనిపిస్తుంది

నటీనటులు:

సాయి రోనక్ బాగున్నాడు. నటన కూడా ఓకే. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో బాగానే ఒదిగిపోయాడు. తర్వాత రైతు పాత్రలోకి మారినపుడు మాత్రం సూట్ కాలేదనిపించింది. ఎమోషనల్ సీన్లలో రోనక్ బాగా చేశాడు. హీరోయిన్ ప్రగ్యా నగ్రా పర్వాలేదు. తన లుక్స్.. అలాగే నటన యావరేజ్ అనిపిస్తాయి. రాజేంద్ర ప్రసాద్ తనకు నప్పని పాత్రను చేశాడిందులో. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడానికి ఆయన బాగానే కృషి చేసినప్పటికీ.. అవి అసహజంగానే అనిపిస్తాయి. చాలా సీన్లు కూడా అలాగే తయారయ్యాయి. ఇంకా చాలా మంది ఆర్టిస్టుల మిస్ ఫిట్ అనిపించారు. రోహిణి మాత్రం అలాంటి ఫీలింగ్ కలిగించలేదు. చాలా బాగా నటించి మెప్పించింది. సప్తగిరి.. రఘుబాబు.. చమ్మక్ చంద్ర.. ఇలా చాలామంది కమెడియన్లు ఉన్నా ఎక్కడా కామెడీ పండలేదు.

సాంకేతిక వర్గం:

'లగ్గం' కోసం పేరున్న టెక్నీషియన్లే పని చేశారు. మణిశర్మ నేపథ్య సంగీతం అందిస్తే.. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం సమకూర్చాడు. ఆర్ఆర్ కంటే చరణ్ అర్జున్ పాటలు మెరుగ్గా అనిపిస్తాయి. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ రమేష్ చెప్పాల ఓకే అనిపిస్తారు . ఎంచుకున్న పాయింట్లోనే కొత్తదనం లేకపోయినా మంచి సబ్జెక్టు నే ఎంచుకున్నారు. కథ మొదలైనపుడే దీని ముగింపు ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. దర్శకుడి నరేషన్ పాత తరహాలో అనిపిస్తుంది .. మరీ నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం కొంచెం కష్టమైపోయింది.

చివరగా: లగ్గం.. సందేశం మంచిదే కానీ

రేటింగ్ - 2.25/5