'లైలా'కి 'A' ఎందుకు వచ్చింది...!
విశ్వక్ సేన్ మాట్లాడుతూ... మా సినిమాకు ఎ సర్టిఫికెట్ ఎందుకు వచ్చింది అనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది.
By: Tupaki Desk | 8 Feb 2025 10:22 AM GMTవిశ్వక్ సేన్ హీరోగా ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన 'లైలా' సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన దక్కింది. సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. లేడీ గెటప్ మేకోవర్‌లో విశ్వక్ సేన్ సర్‌ప్రైజ్ చేశాడు. ట్రైలర్‌లోనే ఇలా ఉంటే సినిమాలో వెండి తెరపై చూస్తే ఇంకా ఎలా ఉంటాడో కదా అనే చర్చ మొదలైంది. లైలా సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగుతుందని ట్రైలర్‌ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.
సాహు గారపాటి నిర్మాణంలో రూపొందిన 'లైలా' సినిమా విశ్వక్ సేన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ విజయాన్ని నమోదు చేయబోతుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే 'లైలా' గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికెట్‌ను ఇవ్వడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇందులో ఎ కంటెంట్ ఏం ఉంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా హీరో విశ్వక్ సేన్ ఆ విషయమై స్పందించాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ సినిమా ఒక మంచి వినోదాత్మకంగా సాగుతుందని, తప్పకుండా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ... మా సినిమాకు ఎ సర్టిఫికెట్ ఎందుకు వచ్చింది అనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. అలా అని ఈ సినిమాలో బూతులు లేవు, హింస లేదని అన్నారు. యూత్‌ను అలరించే హెల్తీ కంటెంట్ ఈ సినిమాలో ఉంటుందని అన్నాడు. దర్శకుడు రామ్ నారాయణ్ ఈ కథ చెప్పినంత సేపు నవ్వుతూనే ఉన్నాను అన్నాడు. అయితే లేడీ గెటప్ ఉంటుందని చెప్పిన సమయంలో కాస్త ఆలోచించాను. లేడీ గెటప్ సెట్ కాకుండా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే లేడీ గెటప్ గురించి చాలా ఆలోచించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నాము. లేడీ గెటప్ కోసం మూడు రకాల లుక్స్‌ను ట్రై చేసి చివరకు ఈ గెటప్‌కి ఫిక్స్ అయ్యాం అన్నారు.
షూటింగ్ పూర్తి అయ్యే వరకు చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా మేకప్ విషయంలో పెద్ద టీం పని చేసింది. గోళ్లు పెంచుకోవడం మొదలుకుని చాలా విషయాలు అమ్మాయిల మాదిరిగా మెయింటెన్ చేయాల్సి వచ్చిందని, ఆ కష్టం అంతా సినిమాలో ప్రేక్షకులు చూస్తారని విశ్వక్ సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చిరంజీవి ప్రీ రిలీజ్ కి హాజరు కావడం వల్ల అంచనాలు మరింత పెరగడం ఖాయం. విశ్వక్ సేన్ గత చిత్రం 'మెకానిక్ రాకీ' సినిమా నిరాశపరచడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.