Begin typing your search above and press return to search.

లైలా సెన్సార్ టెన్షన్.. ఏమవుతుందో..

ఇప్పుడు అదే సమస్యను ఎదుర్కొంటోంది లైలా మూవీ యూనిట్. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 4:59 AM GMT
లైలా సెన్సార్ టెన్షన్.. ఏమవుతుందో..
X

టాలీవుడ్‌లో ఇటీవల A సర్టిఫికెట్ సినిమాల హవా పెరిగింది. ఒకప్పుడు కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉంటారనే భయంతో దర్శకనిర్మాతలు ఈ సర్టిఫికెట్‌ను నివారించేవారు. ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ దొరికితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ స్థాయిలో వస్తాయో ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిరూపించింది. క్లీన్ U సెన్సార్ వస్తే ఒకప్పుడు నిర్మాతలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇక U/A వచ్చినా కూడా కంగారు పడిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. A సెన్సార్ లభిస్తే అసలు బజ్ దానితోనే క్రియేట్ అవుతుంది అనేలా ఓ ఇన్ డైరెక్ట్ కాన్ఫిడెన్స్ తో రిస్క్ తీసుకుంటున్నారు. బ్లడ్ బాత్ ఊచకోత రొమాంటిక్ డోస్ ఎక్కువైనా కంటెంట్ కు తగ్గట్టుగా ఉంటే ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

ఆ రూట్లో వచ్చిన యానిమల్ సినిమా రికార్డుల మోత మోగించింది, బేబీ సినిమా సెన్సేషన్‌గా మారింది. ఈ రెండు సినిమాలూ ఆ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు విరగబడి వీటిని ఆదరించారు. అందుకే ప్రస్తుతం ఈ తరహా సినిమాలకు ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. అయినప్పటికీ ఓ వర్గం టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పటికీ A సర్టిఫికెట్ పై భయంతోనే ఉన్నారు. కుటుంబ ప్రేక్షకుల ఆదరణ కోల్పోతారేమో అనే అనుమానంతో తమ కథలపై సెన్సార్ ప్రభావం పడకుండా చూసుకుంటున్నారు.

ఇప్పుడు అదే సమస్యను ఎదుర్కొంటోంది లైలా మూవీ యూనిట్. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మొదట్నుంచీ ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఫస్ట్ లుక్‌ నుంచే ఇది ఓ డిఫరెంట్ సినిమా అనే టాక్ వచ్చింది. ఇప్పుడు సినిమా సెన్సార్ స్టేజ్‌కు వచ్చేసింది. అయితే U/A వస్తుందా? A వస్తుందా? అనే విషయంలో చిత్రబృందం టెన్షన్‌లో పడింది అని అంటున్నారు . సినిమా కంటెంట్ రీత్యా కొన్ని సీన్స్ మామూలుగా లేవని తెలుస్తోంది. అయితే కొన్ని హాస్యప్రధానమైన సన్నివేశాల్లో బోల్డ్ టచ్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో చాలా సేపు లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి యాంగిల్‌ను పెద్దగా ఎవరూ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఈ గెటప్‌లో ఉండే కొన్ని కామెడీ సీన్స్ కాస్త బోల్డ్ హ్యూమర్‌తో నిండివున్నట్లు సమాచారం. దీంతో సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి కట్ లేకుండా ఎ సర్టిఫికెట్ వస్తే ఓకే కానీ, కొన్ని కీలకమైన సీన్స్ కట్ చేయిస్తే చిత్రబృందం ఆ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుందన్నది చూడాలి.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూసిన వారంతా సినిమాలో ఉన్న కామెడీ మేజర్ హైలైట్ అని చెబుతున్నారు. విశ్వక్ తన పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం, లేడీ గెటప్‌లో నవ్వులు పండించడమే కాకుండా, ప్రేక్షకులను కొత్తదనం అనిపించేలా చేయడం ప్రత్యేకంగా నిలిచే అంశాలుగా మారాయి. ఒకవేళ ఈ పాత్ర కరెక్ట్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, ఈ సినిమా విష్వక్ కెరీర్‌లో మరో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకు టాలీవుడ్‌లో బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలకు పెద్దగా ఆదరణ రాలేదు. కానీ మారిన ట్రెండ్ చూస్తుంటే, లైలా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం ఉంది. విశ్వక్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, ఇది తనకు ఓ కొత్త ప్రయోగమని, ప్రేక్షకులు తాను ఎప్పుడూ లేని విధంగా కొత్త యాంగిల్‌లో చూస్తారని చెప్పాడు. ఈ సినిమా విషయంలో టెన్షన్ ఎక్కడంటే, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు స్పందన ఎలా ఉంటుందనేదే. యువతకు, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కు అయితే ఈ జోనర్ కొత్త అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. సెన్సార్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, దాన్ని చిత్రబృందం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే మాత్రం ఇది మరో బిగ్ హిట్ అవుతుందని అనిపిస్తోంది.