Begin typing your search above and press return to search.

ఆస‌క్తి పెంచిన లాల్ పాన్ ఇండియా టీజ‌ర్

మోహన్‌లాల్‌, లిజో కాంబినేషన్ మూవీ కోసం ఆస‌క్తిగా వేచి చూసిన అభిమానుల‌కు ఈ టీజ‌ర్ ఆస‌క్తిని క‌లిగించింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 4:49 PM GMT
ఆస‌క్తి పెంచిన లాల్ పాన్ ఇండియా టీజ‌ర్
X

సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం - మలైకోట్టై వాలిబన్. ద‌ర్శ‌కుడు లిజో జోస్ పెల్లిస్సేరి, మోహన్‌లాల్ తొలిసారి కలిసి ప‌ని చేసిన‌ సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మోహన్‌లాల్‌, లిజో కాంబినేషన్ మూవీ కోసం ఆస‌క్తిగా వేచి చూసిన అభిమానుల‌కు ఈ టీజ‌ర్ ఆస‌క్తిని క‌లిగించింది.

రెండు సార్లు జాతీయ అవార్డు గ్ర‌హీత‌, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ డిఫరెంట్ లుక్ లో ఉన్న టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ``నువ్వు చూసింది నిజం.. చూడనిది అబద్ధం.. ఇప్పుడు నేను చూపించబోయేది నిజం`` అంటూ మోహన్ లాల్ ఏకపాత్రాభినయంతో టీజర్ ప్రారంభమవుతుంది. లైన్‌లోని చివరి భాగం ఉద్రేకాన్ని పెంచే టింజ్ తో ఆక‌ట్టుకుంది. మోహన్‌లాల్ తన కండువాను ఉప‌యోగించే ప్ర‌త్యేక‌ భంగిమతో టీజ‌ర్ ముగింపు ఆస‌క్తిని పెంచింది. ఎవరైనా టీజర్‌ను డీకోడ్ చేయవలసి వస్తే, మోహన్‌లాల్ మలైకోట్టై వాలిబన్‌లో మాంత్రికుడిగా లేదా భ్రమకారుడిగా నటించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరీ క‌థ‌నం గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. దానికోసం రిలీజ్ వ‌ర‌కూ ఆగాల్సిందే.

నిమిషాల వ్యవధిలోనే వేలాది మంది టీజర్‌ను వీక్షించారు. ఒకటిన్నర నిమిషాల నిడివిగల టీజర్‌ను సరిగమప యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేశారు. జాన్ అండ్ మేరీ క్రియేటివ్స్, సెంచురీ ఫిల్మ్స్, మ్యాక్స్ ల్యాబ్ - సరిగమ ఇండియా లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. `మలైకోట్టై వాలిబన్` మోహన్‌లాల్‌తో యూడ్లీ ఫిల్మ్స్ మొదటి ప్రాజెక్ట్.

ఈ భారీ చిత్రాన్ని రాజస్థాన్, చెన్నై, పాండిచ్చేరిలో 130 రోజుల్లో చిత్రీకరించారు. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ, ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు. సోనాలి కులకర్ణి, హరీష్ పెరడి, డానిష్ సాయిత్, మనోజ్ మోసెస్, కథా నంది, మణికందన్ ఆచారి ఇతర ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం 25 జనవరి 2024న థియేటర్లలోకి రానుంది. అదే సమయంలో మమ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో లిజో దర్శకత్వం వహించిన `నన్‌పకల్ నేరత్ మయక్కుమ్` వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అవార్డులను గెలుచుకుంది. మమ్ముట్టి ఉత్తమ నటుడిగా రాష్ట్ర అవార్డు కూడా గెలుచుకున్నారు.