మరణించిన గాయకులను మళ్లీ పుట్టించారు
ఈ ఇరువురు పాపులర్ గాయకుల స్వరాలకు ఇప్పుడు AR సారథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి మళ్లీ జీవం పోశారు.
By: Tupaki Desk | 30 Jan 2024 3:30 AM GMTవెటరన్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్: 1 (2022)లోని 'పొన్నీ నది..' పాట ఇటీవలి కాలంలో AR రెహమాన్ స్వరకల్పనలోని అత్యంత ప్రజాదరణ పొందిన తమిళ హిట్‌లలో ఒకటి. దురదృష్టవశాత్తూ PS-I థియేటర్లలో విడుదల కావడానికి కొన్ని రోజుల ముందు 'పొన్నీ నది..' గాయకుడు బాంబా బాక్యా గుండెపోటుతో మరణించారు.
అదే విధంగా 1997లో జరిగిన కారు ప్రమాదంలో తమిళ చిత్రం 'జెంటిల్‌మన్' (1993) నుండి AR రెహమాన్ ఎవర్‌గ్రీన్ హిట్ 'ఉసిలంపట్టి పెంకుట్టి ..' వెనుక స్వరం షాహుల్ హమీద్ విషాదకరంగా మరణించాడు. ఈ ఇరువురు పాపులర్ గాయకుల స్వరాలకు ఇప్పుడు AR సారథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి మళ్లీ జీవం పోశారు. రెహమాన్ తాజా చిత్రం 'లాల్ సలామ్' (2024) కోసం ఈ పని చేసి ఆశ్చర్యపరుస్తున్నారు.
రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో ఐశ్వర్య రజనీ కాంత్ దర్వకత్వం వహించిన 'లాల్ సలామ్' త్వరలో విడుదల కానుంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. రిపబ్లిక్ డే నాడు అనగా జనవరి 26న ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. 2 నిమిషాల 47 సెకన్ల నిడివి గల 'తిమిరి ఏడుడా..' అనే పాట లాల్ సలామ్ ఆల్బమ్ ఐదు పాటల్లో భాగమని వెల్లడైంది.
స్నేహన్ సాహిత్యంతో కూడిన ఈ తిమిరి యెజుడా పాట, దివంగత బాంబా బాక్యా - షాహుల్ హమీద్ ల AI స్వరాలతో మేల్ ప్లేబ్యాక్ పాడారు. లాల్ సలామ్ కి ఐశ్వర్య రజనీకాంత్ సహ-రచయిత. అలాగే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో హక్కుల కోసం సోనీ మ్యూజిక్ భారీ మొతం ముట్టజెబుతోందని సమాచారం. ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్ లో తెరకెక్కింది. మరణించిన గాయకులను ఇలా ఏఐ సాంకేతికతతో మళ్లీ పుట్టించే ప్రయత్నానికి హ్యాట్సాఫ్.