55లక్షలు చెల్లించి చంద్రుడిపై భూమి కొన్న హీరో!
చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో ప్రపంచదేశాల్లో చందమామ యాత్రకు సంబంధించిన సిసలైన పోటీ మొదలైంది.
By: Tupaki Desk | 27 Aug 2023 4:55 PM GMTచంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో ప్రపంచదేశాల్లో చందమామ యాత్రకు సంబంధించిన సిసలైన పోటీ మొదలైంది. చంద్రునిపైకి భారతదేశం మూడవ మిషన్ (చంద్రయాన్ 3) 2023 ఆగస్టు 23న ఫలించింది. ఇప్పటికే ల్యాండ్ రోవర్ అన్వేషణ మిషన్‌ను ప్రారంభించింది. ఇస్రో సాధించిన ఈ విజయాన్ని భారతదేశ ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే చంద్రయాన్ 3 విజయంతో చందమామపై కాలనీలు నిర్మించుకోవచ్చని ఇస్రో ఛైర్మన్ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు ప్రజలంతా దానిపై దృష్టి సారించారు. ఆసక్తికరంగా చంద్రునిపై ఎవరైనా భూమిని కొనుగోలు చేయవచ్చనేది ఎందరికి తెలుసు?
ఇప్పటికే చందమామపై భూమిని కొనుక్కున్న ఇద్దరు స్టార్ హీరోలు మనకు ఉన్నారనేది ఎవరికైనా తెలుసా? .. మీరు విన్నది నిజమే! అలాంటి ఇద్దరు బాలీవుడ్ హీరోలు ఉన్నారు. వారి పేరుతో చంద్రునిపై భూమి రిజిస్టర్ అయి ఉంది. అందులో ఒకరు షారుఖ్ ఖాన్ .. మరొకరు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. 2009లో ఒక ఆస్ట్రేలియన్ మహిళ చంద్రునిపై తన కోసం ప్రతి సంవత్సరం ఒక భూమి(కొన్ని చదరపు అడుగులు)ని కొనుగోలు చేస్తోందని SRK ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చంద్రుడిపై అతడు సొంతం చేసుకున్న భూమి ఉన్న ప్రాంతాన్ని ప్రశాంత సముద్రం అంటారని తెలిపారు. నిజానికి చందమామపై ఒక (01) ఎకరం (సుమారు 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్లు) కొనుగోలుకు 37.50 అమెరికన్ డాలర్లు (రూ. 1758.75) ఖర్చవుతుందని కథనాలొచ్చాయి.
షారుఖ్‌ఖాన్‌కి ఎకరాల ఆస్తి:
ప్రముఖ మీడియాతో SRK మాట్లాడుతూ చందమామపై తన ఆస్తుల గురించి ఇలా వెల్లడించారు. ``ఒక ఆస్ట్రేలియన్ మహిళ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున నా కోసం చంద్రునిపై కొద్దిగా భూమిని కొనుగోలు చేస్తుంది. ఆమె కొంతకాలంగా దీన్ని కొనుగోలు చేస్తోంది. నేను లూనార్ రిపబ్లిక్ సొసైటీ నుండి ఈ సర్టిఫికేట్‌లను పొందాను. ఆమె నాకు రంగురంగుల ఇమెయిల్‌లను రాస్తుంది. ఒక లైన్ ఎరుపు, ఒకటి నీలం ఇలా రంగురంగుల మెయిల్స్ వస్తాయి..`` అని ఖాన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజల ప్రేమను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఖాన్ అన్నారు.
తరువాత SRK ఆస్ట్రేలియన్ అభిమాని చందమామపై భూమిని కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. ``అవును, నేను కింగ్ ఖాన్ కోసం చంద్రునిపై ఒక బ్లాక్ భూమిని కొనుగోలు చేసాను. ఎందుకంటే చంద్రుడిపై భూమిని సొంతం చేసుకున్న మొదటి హిందీ సినిమా హీరో షారూఖ్ మాత్రమే కావాలని కోరుకున్నాను.. చంద్రా! అతడు (షారూఖ్) ఎల్లప్పుడూ ప్రతిదానిలో మొదటి స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను... అని అన్నారు.
2002లో షారూఖ్ పుట్టినరోజు సందర్భంగా నేను అతని పేరు మీద స్కార్పియస్ రాశిలో ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసాను.. (ఇలాంటిది ఒక హిందీ హీరోకి మొదటిది) అని కూడా వెల్లడించారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల ASOKA థీమ్‌ను అనుసరించడం నాకు ఇష్టమైనది. బహుశా షారూఖ్ తదుపరి పుట్టినరోజు కోసం సూర్యునిపై స్థలం కొనేందుకో లేదో ఇంకేదైనా కొనేందుకు ప్రయత్నిస్తానేమో! అని సరదాగా వ్యాఖ్యానించాడు.
యువహీరోకి చందమామపై ఆస్తి:
సుశాంత్ సింగ్ ఫిజిక్స్ ని అమితంగా ప్రేమించే విద్యార్థి. అతడు చంద్రునిపై ఆస్తిని కొనుక్కున్నాడు. చందమామపై ఆస్తిని కొనుగోలు చేసిన ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా సీ ఆఫ్ ముస్కోవి అని పిలుస్తారు. దీనికి దివంగత నటుడు సుశాంత్ చెల్లించిన ధర దాదాపు రూ.55 లక్షలు. సుశాంత్ వద్ద తన ఆస్తిని చెక్ చేసుకునేందుకు భారీ టెలిస్కోప్ కూడా ఉంది. దానితో అతడు చందమామపై తన ఆస్తిని పదే పదే తనిఖీ చేసేవాడు. ఏక్తా కపూర్ టీవీ సిరీస్ `పవిత్ర రిష్టా` .. బయోపిక్ డ్రామా ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో సుశాంత్ నటించాడు. 14 జూన్ 2020న అతడు అనుమానాస్పదంగా తన ఇంటి గదిలో మరణించాడు.