ఆస్కార్ ఎంట్రీ మూవీ టైటిల్ మార్పు... కారణం ఇదేనా!
లపతా లేడీస్ టైటిల్ ను 'లాస్ట్ లేడీస్' అంటూ మార్చారు.
By: Tupaki Desk | 13 Nov 2024 7:19 AM GMT2025 ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి 'లపతా లేడీస్' అధికారిక ఎంట్రీ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఎంట్రీ దక్కించుకోగానే సినిమాకు అవార్డు వస్తుంది అనుకుంటే పొరపాటే. సినిమాను దేశ విదేశాల్లోని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడంతో పాటు, ఆస్కార్ అవార్డ్ కమిటీ మెంబర్స్ ముందుకు సినిమాను తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. కమిటీ ముందు చాలా సినిమాలు ఉంటాయి, కనుక అందులో వారు కేవలం 80 శాతం సినిమాలు మాత్రమే చూస్తారని అమీర్ ఖాన్ అన్నారు. కనుక సినిమాను వారి వద్దకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది. అందుకోసం సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేయాల్సి ఉంటుందని ఆయన తన లగాన్ రోజులను గుర్తు చేసుకున్నారు.
'లపతా లేడీస్' టైటిల్ తో కిరణ్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆస్కార్ బరిలో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశ్యంతో టైటిల్‌ను మార్చడం జరిగింది. ఆస్కార్ అవార్డు కమిటీ ముందుకు తీసుకు వెళ్లిన సమయంలో వారికి ఈజీగా నోటెడ్ కావడం కోసం టైటిల్ ను మార్చారని తెలుస్తోంది. లపతా లేడీస్ టైటిల్ ను 'లాస్ట్ లేడీస్' అంటూ మార్చారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు ఒక పోస్టర్‌ను సైతం విడుదల చేయడం జరిగింది. కథకు తగ్గట్లుగానే లాస్ట్ లేడీస్ టైటిల్ ఉందని, ఆస్కార్‌లో అడుగు ముందుకు వేయడం కోసం టైటిల్ ను మార్చారని తెలుస్తోంది.
ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడం కోసం నిర్మాతల్లో ఒకరైన ఆమీర్ ఖాన్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఆస్కార్ అవార్డులకు వెళ్లే సినిమాలు ఎదుర్కొనే సమస్యల గురించి చెప్పుకొచ్చారు. లగాన్ సినిమా ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు చూపించే సమయంలో తాను, దర్శకుడు వారికి టీ, బిస్కట్‌లు సప్లై చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. అక్కడ బహుమానాలు ఇచ్చి వారిని మ్యానేజ్ చేయవచ్చు అని అనుకుంటారు. కానీ అస్సలు అలా జరగదు అని అమీర్ ఖాన్ తెలియజేశాడు. లాస్ట్ లేడీస్ సినిమాను మరింతగా ప్రమోట్ చేసి ఆస్కార్ కమిటీ ముందుకు తీసుకు వెళ్లాలని వారు భావిస్తున్నారట.
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు రైలు ప్రయాణం సమయంలో అనుకోకుండా తారుమారు కావడంతో కథ మొదలవుతుంది. 2001 టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా సాగుతుంది. విభిన్నమైన నేపథ్యంతో పాటు, చక్కటి స్క్రీన్ ప్లేతో దర్శకురాలు కిరణ్ రావు స్వీయ నిర్మాణంలో రూపొందించారు. అమీర్ ఖాన్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఆస్కార్ ఎంట్రీ దక్కించుకున్న సినిమాలు ప్రమోషన్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొంత మొత్తంను ప్రభుత్వం నుంచి అందించే అవకాశాలు ఉంటాయి, మరికొంత మొత్తంను నిర్మాతలు పెట్టుకోవాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ అయ్యే వరకు అంతర్జాతీయ స్థాయి మీడియాలో ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. మరి చివరకు లాస్ట్ లేడీస్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంటుందా, అవార్డు సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.