Begin typing your search above and press return to search.

శేఖర్ బాషాపై మరో ఫిర్యాదు.. కేసులో మరో ట్విస్ట్!

ఇదే సమయంలో, శేఖర్ బాషాపై మరో ఫిర్యాదు రావడం కేసును మరింత మలుపు తిప్పింది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 11:28 AM GMT
శేఖర్ బాషాపై మరో ఫిర్యాదు.. కేసులో మరో ట్విస్ట్!
X

బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా అతనిపై వివిధ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త ఫిర్యాదు మరింత చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సృష్టి వర్మ చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.

సృష్టి వర్మ ఇచ్చిన ఫిర్యాదులో, శేఖర్ బాషా తన వ్యక్తిగత కాల్స్‌ను రికార్డు చేసి అవి లీక్ చేశాడని పేర్కొన్నారు. దీనివల్ల తన పరువుకు భంగం కలిగిందని, కొందరు యూట్యూబ్ ఛానెల్స్‌లో శేఖర్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తన ప్రైవేట్ డేటాను బయటకు లీక్ చేసినందుకు, శేఖర్ బాషా వద్ద ఉన్న మొబైల్ ఫోన్ సహా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన నార్సింగి పోలీసులు, ఐటీ యాక్ట్ 72, బీఎస్ఎన్ యాక్ట్ సెక్షన్ 79, 67 కింద కేసు నమోదు చేశారు.

ఇదే సమయంలో, శేఖర్ బాషాపై మరో ఫిర్యాదు రావడం కేసును మరింత మలుపు తిప్పింది. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య కూడా శేఖర్‌పై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి అనే వ్యక్తి తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నాడని, శేఖర్ బాషా కూడా అందుకు సహకరించాడని లావణ్య ఆరోపించారు. తన ఇంట్లో 140 గ్రాముల డ్రగ్స్ పెట్టి అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఆమె పోలీసులకు ఆడియో ఆధారాలను అందజేయగా, కేసు విచారణ దశలో ఉంది.

మస్తాన్ సాయి డ్రగ్స్ కేసు ఇప్పటికే టాలీవుడ్‌ను షేక్ చేస్తుండగా, ఇప్పుడు శేఖర్ బాషా పేరు కూడా మరోసారి తెరపైకి రావడం తీవ్ర చర్చకు దారితీసింది. నిన్నటివరకు మీడియా వర్గాల్లో మస్తాన్ సాయిపైనే ప్రధానంగా ఫోకస్ ఉండగా, ఇప్పుడు శేఖర్ బాషాపై కూడా విచారణ జరిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ ఆధారంగా మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇప్పుడు శేఖర్ బాషాను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి.

టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో వరుస వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్, బ్లాక్ మెయిల్, లీక్ వీడియోల వ్యవహారాలు వాస్తవంగా ఏ స్థాయికి వెళ్లాయో చెప్పడం కష్టం. నటి లావణ్య ఆరోపణలు, సృష్టి వర్మ తాజా ఫిర్యాదుతో శేఖర్ బాషాపై ఒత్తిడి పెరుగుతోంది. పోలీసుల విచారణ ఎలా సాగుతుందో చూడాలి.