రాజ్ తరుణ్, లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. బంగారం మాయం!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 10 Sep 2024 10:13 AM GMTటాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. పదేళ్లపాటు తనతో కలిసి ఉండి, పెళ్లి చేసుకుని, ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వల్ల దూరం పెడుతున్నాడని లావణ్య ఇప్పటికే ఆరోపణలు చేసింది. ఆ తర్వాత అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. అంతే కాదు.. తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతూ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేసింది.
లావణ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు.. సాక్ష్యాలు సేకరించారు. రాజ్ తరుణ్ పై ఇటీవల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుడిగా ఆయన పేరును కూడా చేర్చారు. అయితే లావణ్య ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని రాజ్ తరుణ్ పలుమార్లు తెలిపారు. తాను న్యాయస్థానంలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా వివిధ ఆరోపణలు చేశారు. ఆమె పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు.
ఇప్పుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా లావణ్య దొంగతనం కేసు పెట్టింది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై మళ్లీ ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. సుమారు రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు పోలీసులకు తెలిపింది. తాను కొన్న బంగారం యొక్క రసీదులు కూడా లావణ్య అందించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లికి సంబంధించిన అన్ని ప్రూఫ్ లను మాయం చేసేందుకు రాజ్ తరుణ్ ప్రయత్నించాడని ఆరోపించింది. తాళిబొట్టుతోపాటు డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదు చేసింది. తన నగలు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇంటి బీరువాలో పెట్టానని చెప్పింది. ఆ బీరువా లాక్ రాజ్ తరుణ్ వద్ద ఉందని తెలిపింది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. వాటిని పోలీసులకు కూడా అందించినట్లు తెలుస్తోంది.
"నా మనిషిని తీసుకెళ్లి పోయింది.. ముంబైలో పెట్టుకుంది.. ఇప్పటికైనా మీడియా వారు నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నా మనిషి, బంగారం అన్నీ తీసుకెళ్లిపోయి.. నన్ను ఒంటరి దాన్ని చేశారు. బాక్సులు అన్నీ ఖాళీ ఉన్నాయి.. నాలుగు బంగారు గాజులు, పుస్తెల తాడు, చైన్ తీసుకెళ్లిపోయారు" అని మీడియాకు తెలిపింది లావణ్య. ఆ తర్వాత తన ఆభరణాలకు సంబంధించిన బిల్స్ తోపాటు ఖాళీ బాక్సులను చూపించింది.