రిపోర్టర్ హత్యోదంతంపై మెగా కోడలు గట్సీ పోరాటం
Lavanya Tripathi Reaction To Reporter Mukesh Chandrakar Murder
By: Tupaki Desk | 13 Jan 2025 4:34 AM GMTపెద్ద కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టడమే కాదు... ఎంతో ఒద్దికగా ఆ కుటుంబంలో కలిసిపోయి, భర్తతో అన్యోన్య జీవితాన్ని ఆస్వాధిస్తోంది యువకథానాయిక లావణ్య త్రిపాఠి. ఈ డెహ్రాడూన్ బ్యూటీ అందచందాలకు ఫిదా అయిన మెగాహీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వరుణ్- లావణ్య జంట ముచ్చటైన జంట. వీరి ఏడేళ్ల ప్రేమాయణం అభిమానులకు ఎంతో స్ఫూర్తి. ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడిన మెగా హీరోగా వరుణ్ తేజ్ కి ప్రత్యేక గుర్తింపు అభిమానుల్లో ఉంది.
అదంతా అటుంచితే లావణ్య త్రిపాఠిలో వరుణ్ తేజ్‌కి ఇంకా ఎలాంటి క్వాలిటీస్ నచ్చాయి? అంటే కచ్ఛితంగా తన గట్స్ కి అతడు ఫిదా అవ్వకుండా ఉండలేడు. ఎందుకు అంటే..? సమాజంలో ఎన్నో అఘాయిత్యాలను చూస్తున్నాం. వాటిని చూస్తూనే లైట్ తీస్కుంటారు ప్రజలు. కానీ లావణ్య త్రిపాఠి అలా కాదు.. కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించదు. ఘటనపై ధైర్యంగా స్పందిస్తుంది.
ఇప్పుడు ఓ మర్డర్ కేసులో బాధితుని తరపున న్యాయపోరాటానికి లావణ్య సిద్ధమైంది. తాజాగా మెగా కోడలు లావణ్య ఓ షాకింగ్ ట్వీట్ చేసింది. ప్రముఖ రిపోర్టర్ ముకేష్ చంద్రకర్‌ను కొందరు దుండగలు హతమార్చిన వార్తలు సంచలనంగా మారగా, ఇది లావణ్య దృష్టిలో పడింది. ఒక పెద్ద స్కామ్ ను వెలికి తీసిన గట్సీ రిపోర్టర్ ని హత్య చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో హత్యోదంతంపై లావణ్య పోరాటం మొదలెట్టింది. అతడికి న్యాయం చేయాలంటూ ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్ జోడించి మరీ ముకేష్ చంద్రకర్ కు అండగా నిలిచింది. బాధితుడు ముఖేష్ చత్తీష్ ఘడ్ కి చెందిన రిపోర్టర్. స్థానికంగా రోడ్ కాంట్రాక్ట్ నిర్మాణ పనల్లో భారీ కుంభకోణాన్ని వెలికి తీసిన అతడిని కొందరు రాజకీయ నాయకులు, బంధువులు కుట్రపన్ని హత్య చేయించినట్టు కథనాలొచ్చాయి.
ఇది హత్య కేసు. హంతకులు ప్రమాదకరమైన వాళ్లు. అయినా దానికి భయపడని లావణ్య త్రిపాఠి ఇలా గట్సీగా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హత్యోదంతంపై స్పందిస్తూ బాధిత కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా, నిందితులను కఠినంగా శిక్షించాలని లావణ్య సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లావణ్య గట్స్ కి మెగాభిమానులు ఫిదా అయిపోతున్నారు. తన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి నటనలో తన కెరీర్ ని కొనసాగించాలని భావిస్తోంది. సతీ లీలావతి అనే సినిమాలో నటిస్తున్న విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.