Begin typing your search above and press return to search.

వెబ్‌సైట్లో లారెన్స్ బిష్ణోయ్ టీ-షర్టులు!

స‌ద‌రు వెబ్ సైట్ వ్య‌వహారాన్ని ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్ అలీషన్ జాఫ్రీ హైలైట్ చేశారు.

By:  Tupaki Desk   |   5 Nov 2024 11:30 PM GMT
వెబ్‌సైట్లో లారెన్స్ బిష్ణోయ్ టీ-షర్టులు!
X

పాపులర్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మీషో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బ్రాండ్ టీ-షర్టులను విక్రయించడం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తెర‌తీసింది. స‌ద‌రు వెబ్ సైట్ వ్య‌వహారాన్ని ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్ అలీషన్ జాఫ్రీ హైలైట్ చేశారు. అతడు దీనిని ''భారతదేశం తాజా ఆన్‌లైన్ రాడికలైజేషన్''కి ఉదాహరణగా పేర్కొన్నాడు.

లారెన్స్ బిష్ణోయ్ టీ-షర్టులు విక్రేతలు - కస్టమర్‌ల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసే ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అయిన మీషోలో సేల్ కి పెట్టార‌ని జాఫ్రీ Xలో ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. తెల్లటి టీ-షర్టులపై లారెన్స్ బిష్ణోయ్ ఫోటోను ముద్రించి అమ్మేస్తున్నారు. కొన్నిటికి 'గ్యాంగ్‌స్టర్' అనే పదాన్ని ఉప‌యోగించారు. అయితే ఈ టీష‌ర్లులు కేవ‌లం రూ.168కి విక్ర‌యించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఇలా టీ-షర్టులపై నేర‌గాళ్ల ఫోటోల‌ను ముద్రించి ప్ర‌చారం క‌ల్పించ‌డం.. పైగా బ్రాండెడ్ వస్తువులలో కొన్ని పిల్లలను లక్ష్యంగా చేసుకుని అమ్మ‌కాలు సాగించడం మరింత ఆందోళన కలిగిస్తుంది.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ .. అతని సిండికేట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాను హ‌త్య చేసాక‌, స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామ‌ని బెదిరించారు. గత నెలలో జరిగిన ఎన్‌సిపి నేత బాబా సిద్ధిక్ హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధం ఉంది. అలాంటి ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తి ఫోటోను ముద్రించి టీష‌ర్టులు అమ్మ‌డ‌మా? అంటూ నెటిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు.

మీషో , టీషాపర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో గ్యాంగ్‌స్టర్ ఫోటోతో వస్తువులను విక్రయించ‌డం షాక్ కి గురి చేస్తోంది. ముఠా నేరాలలో యువత చేరకుండా నిరోధించడానికి పోలీసులు , NIA పోరాడుతున్న సమయంలో సోషల్ మీడియా ప్రభావశీలులు మాఫియాల గురించి ప్రచారం చేయడం.. గ్యాంగ్‌స్టర్‌లను కీర్తించడం ద్వారా త్వరగా డబ్బు సంపాదిస్తున్నారు అని జాఫ్రీ విమ‌ర్శించారు. ఆయ‌న‌ నిజ జీవిత ఉదాహరణలను చెబుతూ గ్యాంగ్‌స్టర్‌లను కీర్తించడంలో ఉన్న సమస్యలను హైలైట్ చేసారు. 15 ఏళ్ల చిన్నారి గ్యాంగ్‌స్టర్ కంటెంట్ వీక్షించి ప్రేరణ పొంది, తన స్నేహితుడిని చంపాడు..అదే విధంగా ఢిల్లీలోని ముగ్గురు యువకులు `బద్నామ్ గ్యాంగ్` అనే పేరుతో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసి, డాన్‌లుగా మారాలనే లక్ష్యంతో ఒకరిని హత్య చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను వైరల్ చేయాలని ప్లాన్ చేశారు! అని జాఫ్రీ పేర్కొన్నారు. మీషోలో గ్యాంగ్‌స్టర్ టీ-షర్టులు విక్రయిస్తున్నందున చాలామంది పేరెంట్ త‌మ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.