Begin typing your search above and press return to search.

స్టార్ హీరో హ‌త్యకు కుట్ర‌.. గ్యాంగ్‌స్ట‌ర్స్‌కి 20ల‌క్ష‌ల అడ్వాన్స్‌

బాలీవుడ్ స్టార్ హీరో హ‌త్య‌కు మోస్ట్ డేంజ‌రస్ గ్యాంగ్ స్ట‌ర్ భారీ కుట్రకు పాల్ప‌డ‌గా ఈ కేసు ఇప్ప‌టికే సంచ‌ల‌నం అయిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   1 Aug 2024 11:30 AM GMT
స్టార్ హీరో హ‌త్యకు కుట్ర‌.. గ్యాంగ్‌స్ట‌ర్స్‌కి 20ల‌క్ష‌ల అడ్వాన్స్‌
X

బాలీవుడ్ స్టార్ హీరో హ‌త్య‌కు మోస్ట్ డేంజ‌రస్ గ్యాంగ్ స్ట‌ర్ భారీ కుట్రకు పాల్ప‌డ‌గా ఈ కేసు ఇప్ప‌టికే సంచ‌ల‌నం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ప‌లువురిని అరెస్ట్ చేసారు. విచార‌ణ‌లో చాలా నిజాలు నిగ్గు తేల్తున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు.. స్టార్ హీరో హ‌త్య కోసం భారీ ప్యాకేజీని మాట్లాడుకున్నార‌ని తెలిసింది. గ్యాంగ్ స్ట‌ర్స్ కి 20 ల‌క్ష‌ల మేర అడ్వాన్స్ గా చెల్లింపులు చేసార‌ని తెలుస్తోంది. ఈ కేసులో స‌ద‌రు స్టార్ హీరోపై బెదిరింపుల ఫ‌ర్వం ఇటీవ‌ల సంచ‌ల‌నంగా మారింది. స్టార్ హీరో, అత‌డి కుటుంబం నిదురిస్తున్న స‌మ‌యంలో ఇద్ద‌రు గ్యాంగ్ స్ట‌ర్స్ బైక్ పై వ‌చ్చి ముంబైలోన‌ అత‌డి ఇంటిపైకి కాల్పులు జ‌రిపి పారిపోయారు. అనంత‌రం ఈ కేసును ముంబై పోలీస్ సీరియ‌స్ గా తీసుకుని ద‌ర్యాప్తు సాగిస్తున్నారు.

ఈ వ్య‌వ‌హారం అంతా ఏ హీరో గురించో ఈపాటికే అర్థ‌మై ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ హ‌త్య కుట్ర గురించే ఇదంతా. ఇంత‌కుముందు సల్మాన్ ఖాన్ హౌస్ ఫైరింగ్ కేసులో వ‌రుస ప‌రిణామాలు సంచ‌ల‌నంగా మారాయి. సూపర్ స్టార్ స‌ల్మాన్‌ను చంపమని గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ ఆరుగురు వ్యక్తులకు 20 లక్షలు ఇచ్చాడని తాజాగా వెల్లడైంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం.. ఖాన్‌ను చంపాల‌ని కాంట్రాక్ట్ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ కుట్ర చేసాడు. భాయ్ ని చంపాల్సిందిగా ఆరుగురు నిందితులకు రూ.20 లక్షలు చెల్లించాడు.

జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) జారీ చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. అనంత‌రం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గోదేరా అనే వ్యక్తిపై మరో వారెంట్ కూడా జారీ అయింది. గతంలో లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ బాలీవుడ్ సూపర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరపడానికి ముందు షూటర్లకు తొమ్మిది నిమిషాల సుదీర్ఘ `ప్రేరణాత్మక` ప్రసంగం ఇచ్చారని కూడా క‌థ‌నాలొచ్చాయి.

ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో అన్మోల్ బిష్ణోయ్ ఇద్దరు షూటర్‌లు - విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను ప్రేరేపిస్తూ.. ఇది చ‌రిత్ర‌కు స్క్రిప్టు అవుతుంది కాబ‌ట్టి మీరంతా బాగా ప‌ని చేయాల‌ని సూచించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. ``ఈ పని బాగా చెయ్యి. పని పూర్తయిన తర్వాత మీరు చరిత్రను స్క్రిప్ట్ గా రాస్తారు!`` అని అతడు షూటర్‌లకు చెప్పిన‌ట్టు.. 1,735 పేజీల ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. ``ఈ పని చేస్తున్నప్పుడు అస్సలు భయపడకు. ఇది చేయడం అంటే సమాజంలో మార్పు తీసుకురావడమే`` అని అన్మోల్ బిష్ణోయ్ అన్నారు. ఆడియో సందేశంలో షూటర్లను `సల్మాన్ ఖాన్‌ను భయపెట్టే విధంగా కాల్చండి` అని అడిగారు. నిర్భయంగా కనిపించేందుకు హెల్మెట్‌లు ధరించవద్దని, సిగరెట్ తాగాల‌ని కోరారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబై బాంద్రా ప్రాంతంలో స‌ల్మాన్ ఖాన్‌కు చెందిన గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల తుపాకీ కాల్పులు జరిగాయి. తర్వాత గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తున్న‌ట్టు తెలిపాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడి వెనుక ఉన్నట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ షాకింగ్ సంఘటన తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. ఇప్ప‌టికే దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ లో ఎన్నో క‌ఠోర నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయ్.