రెహమాన్ దంపతులు మళ్లీ కలిసిపోతున్నారా?
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సైరా భాను తరఫున లాయర్ వందనా షా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 30 Nov 2024 10:17 AM GMTఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రీసెంట్ గా తన సతీమణి సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న వారు.. సడెన్ గా విడిపోతున్నారని ప్రకటన రావడంతో అంతా షాక్ అయిపోయారు. ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు.
రెహమాన్, సైరా భానుకు 1995లో పెళ్లి కాగా.. వారి వివాహ బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ ఉన్నారు. వారిలో ఖతీజాకు పెళ్లి కూడా అయింది. అయితే మళ్లీ రెహమాన్ దంపతులు కలిసిపోతే బాగుణ్ణు అని చాలా మంది అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. అది జరిగేలా ఇప్పుడు కనిపిస్తోంది!
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సైరా భాను తరఫున లాయర్ వందనా షా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పిల్లల ఆలనా పాలనాతోపాటు విడాకుల విషయం పునరాలోచన వంటి అంశాలపై మాట్లాడారు. పిల్లల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఫైనల్ డిసిషన్ ఇంకా తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
అయితే వాళ్లలో యుక్త వయసు వాళ్ళు ఉన్నారు కనుక.. ఎవరి దగ్గర ఉండాలో వాళ్లే ఎంపిక చేసుకోవచ్చని వందన అభిప్రాయపడ్డారు. ఏఆర్ రెహమాన్, సైరా భాను విడాకులు పక్కన పెట్టి మళ్లీ కలిసిపోయే అవకాశాలు ఉన్నాయా అని అడగ్గా.. వాటిని లాయర్ కొట్టిపారేయలేదు. పైగా ఇద్దరి మధ్య సయోధ్య కుదరదని తాను అనలేదని తెలిపారు.
తాను ఒక ఆశావహురాలినని వందన చెప్పారు. తానెప్పుడూ లవ్, రొమాన్స్ గురించి మాట్లాడుతానని అన్నారు. రెహమాన్, సైరా చేసిన ఉమ్మడి ప్రకటన క్లియర్ గా ఉందని తెలిపారు. అది వాళ్ల బాధ, విడిపోవడం గురించి చెబుతుందని అన్నారు. వారిద్దరిదీ లాంగ్ జర్నీ అని, సయోధ్య కుదరదని మాత్రం తానెప్పుడూ చెప్పలేదని చెప్పారు.
విడాకులు మంజూరైతే రెహమాన్ భారీ భరణం చెల్లించాల్సి వస్తుందన్న వార్తలపై వందనను స్పందించమని అడగ్గా.. ఆ విషయంపై తాను ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని తెలిపారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. రెహమాన్ దంపతులు మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు.