అలీకి నోటీసులు.. కారణం ఇదే..
సినీ పరిశ్రమలో తన కామెడీతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు నటుడు అలీ. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
By: Tupaki Desk | 24 Nov 2024 9:12 AM GMTసినీ పరిశ్రమలో తన కామెడీతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు నటుడు అలీ. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొన్ని రోజులపాటు వైసీపీలో కొనసాగగా.. ఇటీవల రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పారు. ఇక అప్పటి నుంచి టీవీ షోస్ చేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ సాగుతున్నారు.
తాజాగా.. అలీకి కీలక నోటీసులు జారీ అయ్యాయి. అలీకి వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామపంచాయతీ రెవెన్యూలో ఫామ్‌హౌస్ ఉంది. అందులో అనుమతి లేకుండా పలు నిర్మాణాలు నిర్మిస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎక్‌మామిడి పంచాయతీ శాఖ అలీకి నోటీసులు జారీ చేసింది. పంచాయతీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 5న అలీకి మొదటి సారి నోటీసులు ఇచ్చారు. కానీ.. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు.
దాంతో గ్రామ పంచాయతీ నుంచి అలీకి మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. అయితే.. అలీకి చెందిన వారు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఫామ్‌హౌస్‌లో పనిచేసే వారికి నోటీసులు అందించారు. గ్రామ కార్యదర్శి ఈ మేరకు ఈ నోటీసులు అందించారు. ఫామ్‌హౌస్‌లో చేపడుతున్న కట్టడాలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈ మేరకు కార్యదర్శి శోభారాణి ఆదేశించారు. వెంటనే ఆ నిర్మాణాలను సైతం నిలిపివేయాలని అన్నారు.
అలాగే.. ఫామ్‌హౌస్‌కు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఆమె సూచించారు. వెంటనే అనుమతులు పొందాలని కోరారు. లేనిపక్షంలో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం అలీపై చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. అయితే.. ఇప్పటికే మొదటి సారి నోటీసులు అందుకున్న అలీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రెండో సారి ఇచ్చిన నోటీసుల పైన కూడా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.